
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటోందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. పౌర హక్కుల రక్షణ, దళితులపై దాడుల నివారణ చట్టాల అమలు పురోగతిపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
దళితుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. అంబేడ్కర్ అలోచనలకు అనుగుణంగా షెడ్యూల్ కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక సంస్కరణలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అంటరానితనాన్ని పారద్రోలేందుకు దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, జీఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.