సాక్షి, బెంగళూరు: ఆయనది భారత్.. ఆమెది పాకిస్తాన్. ఆమె అక్రమంగా భారత్‌లోకి చొరబడింది. వారికి ఈ మధ్యే ఓ అమ్మాయి పుట్టింది. ఆ బిడ్డ జాతీయతను నిర్ధారించడం బెంగళూరు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. కేరళకు చెందిన మహ్మద్ శిహాబ్ 2010లో దుబాయ్‌కి వెళ్లి ఓ నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిన సమీరా అబ్దుల్ రెహమాన్ అనే యువతితో అతడు అక్కడ ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.
ఇందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారు మరో ఇద్దరు పాకిస్తాన్‌కే చెందిన దంపతులతో కలసి నేపాల్ మీదుగా కోల్‌కతాకు అక్కడి నుంచి బెంగళూరు చేరుకున్నారు. వీరంతా కుమారస్వామి లేఔట్లో అద్దె ఇంట్లో కలిసే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. మిగిలిన ముగ్గురుకి మహ్మద్ శిహాబ్ నకిలీ ఆధార్ కార్డులను సంపాదించి పెట్టాడు. ఈ సంగతి తెలియడంతో మే నెలలో పోలీసులు నలుగురినీ అరెస్టుచేశారు. అరెస్టు సమయంలో గర్భిణిగా ఉన్న రెహమాన్ సెప్టెంబర్ 19న ఇక్కడి వాణి విలాస్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మినిచ్చింది. తల్లీబిడ్డ ఆస్పత్రిలోనే ఉన్నారు.
నిబంధనలు ఏమంటున్నాయి?
ద సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 ప్రకారం 2004 డిసెంబర్ 3 తర్వాత భారత్‌లో పుట్టే శిశువు భారతీయుడు లేదా భారతీయురాలే. శిశువు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారతీయుడై ఉండాలి. మరొకరు అక్రమ వలసదారు కాకూడదు. ఈ సందర్భంలో తల్లి అక్రమంగా వలసొచ్చిందికాబట్టి శిశువు జాతీయత ఏమిటనేది తేల్చలేకపోతున్నారు.
నకిలీ ఆధార్ కార్డు కలిగి ఉండటం, అక్రమంగా భారత్‌లో నివసిస్తుండటంలాంటి 9 కేసులను సమీరాతో పాటు మిగిలిన ఇద్దరిపై నమోదుచేశారు. విదేశీ వ్యక్తి ఏదేని కేసులో ఇరుక్కుంటే విచారణ పూర్తయ్యేంత వరకూ అతను లేదా ఆమె దేశం దాటి వెళ్లడానికి లేదు. ప్రస్తుతానికి సమీరా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. బిడ్డను కొద్ది నెలల పాటు తల్లితోనే ఉంచాక∙శిశు సంక్షేమ శాఖకు అప్పగించాలా లేక తండ్రికా అనే విషయంపై పోలీసులు న్యాయనిపుణుల సలహాలు తీసుకునే అవకాశముంది.
ఈ బిడ్డది ఏ దేశం!
Published Sun, Oct 8 2017 1:12 AM | Last Updated on Sun, Oct 8 2017 1:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment