తమ్ముడి కానుకతో రూపాల్..
జైపూర్, రాజస్థాన్: అక్కా, చెల్లెళ్లను ఆటపట్టించి సరదాగా వారిని ఏడిపించే అన్నా, తమ్ముళ్లను మనం చూస్తూనే ఉంటాం. ఖర్చులకు సరిపోక వారి పాకెట్ మనీ కూడా కొట్టేసే తోబుట్టువులను చూసే ఉంటాం. కానీ, సోదరి ఆనందం కోసం జైపూర్‌లోని ఓ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆమె కోసం ఒకటా, రెండా ఏకంగా 62 వేల రూపాయలు కూడ బెట్టాడు. ఇందులో విశేషమేముంది అనుకోవచ్చు. పదమూడేళ్ల కుర్రాడు పాకెట్ మనీని కూడబెట్టడం, అందులోనూ అవన్నీ నాణేల రూపంలో ఉండడం విశేషమే కదా..!
వివరాలు... రూపాల్, యాష్ అక్కాతమ్ముళ్లు. రూపాల్‌కు స్కూటీ అంటే ఇష్టం. యాష్ ఎలాగైనా, ఆమెకు స్కూటీని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చిన ఒక్కో రూపాయిని కూడబెట్టాడు. అలా జమ చేసిన మొత్తాన్ని ఓ పెద్ద బ్యాగులో వేసుకుని రూపాల్‌తో పాటు గతేడాది దీపావళి రోజున హోండా షోరూమ్‌కు మోసుకొచ్చాడు. అప్పటికే షోరూమ్ మూసే వేళయింది. అయితే, యాష్ తన అక్క కోసం దాచిన సొమ్ముని వారికి చూపించి ఎలాగైనా ఈరోజు ఆమెకు స్కూటీ కానుకగా ఇవ్వాలనీ, షోరూమ్ అప్పుడే మూసేయవద్దని వేడుకున్నాడు. కుర్రాడి మాటలకు ముచ్చట పడిన సిబ్బంది సరే అన్నారు.
యాష్ తెచ్చిన బ్యాగులోని నాణేలను లెక్క పెట్టడం మొదలు పెట్టారు. రెండు గంటల పాటు అయిదుగురు సిబ్బంది ఆ మొత్తం నాణేలను లెక్కించగా అరవై రెండు వేల రూపాయలుగా తేలింది. స్కూటీకి సరిపడా డబ్బు అందడంతో సిబ్బంది వెంటనే బండిని వారికి అప్పగించారు. కళ్లలో కొండంత ఆనందం నింపుకున్న యాష్ తన సోదరి రూపాల్‌కు స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. ఎంతో మంది పిల్లలకు ఆదర్శంగా నిలిచాడు. చివరివరకు ఈ విషయం పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పకపోవడం గమనార్హం.
మామూలుగా బండి కొనేందుకు వచ్చిన వారు కొంత మొత్తాన్ని నాణేల రూపంలో చెల్లించడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుందనీ, కానీ.. ఇలా మొత్తం సొమ్ము నాణేలుగా అందించడం ఎప్పుడూ చూడలేదని షోరూమ్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కకు బహుమతి ఇవ్వడం కోసం యాష్ ఇంతగా కష్టపడడం నిజంగా గొప్ప విషయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment