2026 వరకూ సాధ్యం కాదు!
నియోజకవర్గాల పునర్విభజనపై జైరాం రమేష్
► 2026 వరకూ సీల్ చేస్తూ పార్లమెంట్ చట్టం చేసింది
► అందుకే జార్ఖండ్ కోసం మేం రెండేళ్లు కృషి చేసినా కాలేదు
► ఆర్టికల్-170కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్-26 ఉంది
► ఒక్క రాష్ట్రం కోసం డీలిమిటేషన్ సాధ్యం కాదు
► డీలిమిటేషన్‌ను చూపి ఫిరాయింపుల పోత్సాహం సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంత సులువు కాదని విభజన బిల్లు రూపకర్త, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. విభజన చట్టం రూపకల్పన సమయంలోనే ఈ విషయంపై చర్చ జరిగిందన్నారు. 2026 వరకూ ఇది సాధ్యం కాదని, తాను జార్ఖండ్ కోసం రెండేళ్లు కృషి చేసినా ఫలితం దక్కలేదని తెలిపారు. అసెంబ్లీ స్ధానాల పెంపు కోసం పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, వాటన్నింటినీ పక్కన పెట్టి సీట్ల పెంపును తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయడం కుదరకపోవచ్చని చెప్పారు.
ఏపీ విభజన బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘డీలిమిటేషన్‌ను 2026 వరకూ సీల్ చేస్తూ పార్టమెంట్ చట్టాన్ని ఆమోదించింది. అందువల్ల ప్రస్తుతానికి రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ సాధ్యం కాదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-26 లో చిన్న సవరణ ద్వారా అసెంబ్లీ స్థానాల పెంపుకు అవకాశం ఉందంటున్నారు. కానీ అది ఆర్టికల్-170కి లోబడి మాత్రమే ఉంది’’అని తెలిపారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టత ఇవ్వాలన్నారు.
2026కంటే ముందు సాధ్యంకాదు
డీలిమిటేషన్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయని జైరాం రమేష్ తెలిపారు. జనాభా ఆధారంగా అయితే 2026 కంటే ముందుగా అది సాధ్యం కాదన్నారు. ‘‘ఉదాహరణకి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయినప్పుడు శాసనసభ సంఖ్యా బలం 81గా ఖరారు చేశారు. జార్ఖండ్ జనాభా, కేరళ జనాభా సమానంగా ఉన్నాయి. కేరళ శాసన సభ సంఖ్యా బలం 140. ఆ మేరకు జార్ఖండ్ శాసనసభ సంఖ్యా బలం పెంచాలని మేం రెండేళ్లు ప్రయత్నించి విఫలమయ్యాం. అయితే తాను ఆమోదించిన ఏ చట్టాన్నైనా, ఎప్పుడైనా పార్లమెంట్ సవరించవచ్చు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుందో, కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడాలి. పార్లమెంట్ ఆమోదంతోనే మొత్తం సంఖ్యాబలంలో మార్పులు సాధ్యమవుతాయి. అది కేవలం ఒక్క రాష్ట్రం కోసం సాధ్యం కాదు’’ అని వివరించారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే దీనిపై చర్చ జరిగిందని చెప్పారు. అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తన పని తాను చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.