జల్లికట్టుకు బ్రేక్.. ఆపింది తమిళ తంబీలే
చెన్నై: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మళ్లీ బ్రేక్ పడింది. మూడేళ్ల నిషేధపు కట్టు తెంచుకొని పూర్వవైభవంతో సందడి మొదలవుతుందనుకున్న వేళ మరోసారి అంతరాయం ఏర్పడింది. అయితే, ఈసారి అడ్డుకుంది మాత్రం తమిళ తంబీలే. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అనే విషయం తెలిసిందే. మూగజీవాలను ఈ ఆట పేరుతో వేధిస్తున్నారని పెటా కోర్టుకు ఇంకొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టుకు వెళ్లడంతో గత మూడేళ్లుగా ఈ క్రీడపై నిషేధం కొనసాగుతోంది. దీంతో ఈసారి తమిళులలంతా ఒక్కటై తమ సంప్రదాయ క్రీడకు అడ్డుచెప్పొద్దని నినదిస్తూ గత నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తున్నారు.
దీనికి అనూహ్య మద్దతులభించడంతోపాటు ఆందోళన ఉదృతం అయింది. ఈ నేపథ్యంలో ఈ ఆట నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా దానిని గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభమైంది.
ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభించేందుకు రాగా జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం వచ్చే వరకు క్రీడను ప్రారంభించవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ క్రీడను ప్రారంభించకుండానే ముఖ్యమంత్రి సెల్వం అలంగానల్లూరు నుంచి వెనుదిరిగారు. విద్యార్థులతో ఆయన మధ్యాహ్నం భేటీ అవనున్నారు. మరోపక్క, మంత్రులు కూడా ఉదయం 11గంటల ప్రాంతంలో తమ జిల్లాలో ఈ క్రీడను ప్రారంభించాల్సి ఉండగా అక్కడ కూడా నిలిచిపోయాయి.