జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలో వివాదాస్పద జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. జల్లికట్టు నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా జల్లికట్టు క్రీడపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఎడ్లను రెచ్చగొడుతూ, వాటిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నించే ఈ క్రీడకు పలు ఆంక్షలతో అనుమతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏటా పొంగల్ (తెలుగువారికి సంక్రాంతి) పండుగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. జంతువుల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. అయితే జల్లికట్టుపై నిషేధాన్ని ఎన్డీయే ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించే ఎడ్ల బండ్ల పందాలకూ షరతులతో అనుమతినిచ్చింది. కేంద్రం నిర్ణయంపై పలువురు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.