జమాయీ రాజా చచ్చిపోయాడు
బార్మర్: అతను ఎపుడూ పెళ్లి చేసుకోలేదు...ఎవరితోనూ కలిసి ఉండలేదు.. కానీ 55 మంది పెళ్లికూతుళ్లతో కాపురం చేశాడు.. ఆనక చల్లగా అక్కడ నుంచి నగలతో ఉడాయించేవాడు. ఈ క్రమంలో 56వ అమ్మాయికి వలవేసి పోలీసులకు బుక్కయ్యాడు. చివరకు అనామకుడిగా రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో శవమై తేలాడు. నింబాల్ కోట్ గ్రామంలో శనివారం మరణించిన అతగాడికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఎలా చనిపోయాడు .. పోలీసులు ఎందుకు దహన క్రియలు చేశారు అనేది స్పష్టత లేదు.
వివరాల్లోకి వెళ్తే, జియారామ్ జాట్ (54)కు ఉన్న క్రిమినల్ రికార్డు సామాన్యమైంది కాదు. వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు18 కేసులు నమోదయ్యాయి. బాల్యవివాహం అయిన అమ్మాయిలే అతని టార్గెట్. చిన్నప్పుడే పెళ్లయ్యి... వయసు వచ్చి కాపురానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకొని దోచుకోవడం అతని మోడెస్ ఒపరాండీ. అలా ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నపుడు వారితో పరిచయం పెంచుకుని..అల్లుడిగా నమ్మించి .. ఇంట్లోకి చొరబడేవాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళతానని అత్తమామల్ని నమ్మించి ఆ అమ్మాయిలతో కాపురం చేసేవాడు. అనంతరం వారి దగ్గరున్న నగలతో పరారయ్యేవాడు. 2004 లో వేధింపుల కేసులో పోలీసులు జియారామ్ ను అరెస్టు చేసినపుడు స్వయంగా ఈ వివరాలన్నీ విచారణలో అంగీకరించాడు. ఈ తర్వాత కొంత కాలం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన జియా రామ్ 2013 లో మళ్లీ ఇదే కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీసులు అతగాడిని 'జమాయీ రాజా' (అల్లుడుగారు) అని పోలీస్ ఫైల్స్ లో పేర్కొన్నారు.