శ్రీనగర్ : కశ్మీర్‌లో ఉగ్రవాదుల చర్యలకు భయపడి దాదాపు 40 మంది పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు తెలిసింది. గత శుక్రవారం కశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్ పోలీసు అధికారులను(ఎస్పీవో) వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పోలీసులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ‘ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా.. చస్తరా’ అని బెదిరిస్తున్న నేపథ్యంలో 40 మంది ఎస్పీవోలు రాజీనామా చేసినట్లు సమాచారం.
పోలీసు అధికారులు రిజైన్ చేయడమే కాక ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ రాజీనామా వీడియోలను హోం శాఖ ఖండిచడమే కాక సదరు వీడియోల్లో ఉన్న వారు అసలు ఎస్పీవోలే కాదని ప్రకటించింది. ఒక వేళ వారు నిజంగా పోలీసు అధికారులైనా.. కేవలం 40 మంది రాజీనామాల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని హోం శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది ఎస్పీవోలున్నారని వారితో పోల్చుకుంటే రాజీనామా చేసినవారు చాలా తక్కువ అని పేర్కొన్నారు.
ప్రభుత్వం పోలీసుల రాజీనామాలను ఆపేందుకు ఎస్పీవోల జీతాలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 6 వేల రూపాయలు ఉన్న ఎస్పీవోల జీతం త్వరలోనే రూ.10 వేలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాక మరిన్ని రాజీనామా వీడియోలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాడానికి వీలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం దక్షిణ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది.
Comments
Please login to add a commentAdd a comment