
‘పెద్దాయన’ ఇంటికి జయప్రద
న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ సంక్షోభం నేపథ్యంలో అలనాటి సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద మళ్లీ తెరపైకి వచ్చారు. చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా జయప్రద మంగళవారం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ‘పెద్దాయన’ ములాయం సింగ్ యాదవ్ నివాసానికి వచ్చారు. తన కుమారుడిపై జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన ములాయం తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ములాయం సన్నిహితుడు అమర్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. లండన్ నుంచి హుటాహుటిన వచ్చిన ఆయన నేరుగా ములాయం నివాసానికి చేరుకున్నారు.
ఈ సమావేశానికి జయప్రద కూడా హాజరుకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కష్టకాలంలో ‘నేతాజీ’కి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆమె వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని గతేడాది ప్రకటించిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చారు. ములాయం వెన్నంటే నడుస్తారా, ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.