క్రీడారత్నాలకు సత్కారం
సాక్షి, చెన్నై: కామన్వెల్త్‌లో మెరిసిన తమిళ క్రీడారత్నాలను సీఎం జయలలిత సత్కరించారు. మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా మున్ముందు మరింతగా రాణించి తీరుతామని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేశారు. తమకు నగదు ప్రోత్సాహం అందజేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల పరంగా యువతీ, యువకులను ప్రోత్సహించేందుకు జయలలిత ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది.
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతోపాటుగా క్రీడల శిక్షణ, వసతుల కల్పన మీద దృష్టి కేంద్రీకరించింది. మైదానాల ఏర్పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. విజేతలకు విద్యా పరంగా, ఆర్థిక పరంగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో రాణించే తమిళ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సహకాన్ని అందిస్తున్నారు.
కామన్వెల్త్ బంగారాలు : స్కాట్లాండ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తమిళ బంగారాలు సత్తాను చాటారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈ సారి తమిళ క్రీడాకారులు ముగ్గురు బంగారు పతకాల్ని, మరో నలుగురు వెండి పతకాల్ని దక్కించుకున్నారు. తమిళనాడుకు గర్వకారణంగా నిలిచిన వీరిని సత్కరించడంతో పాటుగా నగదు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా వెయిట్ లిఫ్ట్‌లో బంగారం దక్కించుకున్న సతీష్ కుమార్, స్క్వాష్ డబుల్స్‌లో పసిడి పతకాలతో మెరిసిన జ్యోత్స్న చిన్నప్ప, దీపికా పల్లికల్‌కు రూ.50 లక్షలు చొప్పున నజరానా అందజేయడానికి నిర్ణయించారు. టేబుల్ టెన్నిస్‌లో రాణించిన శరత్ కమల్, అమల్ రాజ్‌లకు తలా రూ.30 లక్షలు ప్రకటించారు. ఇక, భారత హకీ జట్టులో తమిళ క్రీడాకారులు రూపేంద్ర పాల్ సింగ్, శ్రీజేష్ పరట్ రవీంద్రలు చోటు దక్కించుకుని రాణించడంతో వారిని సత్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఇద్దరికి కూడా తలా రూ.30 లక్షల్ని ప్రకటించారు.
ఈ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహంగా మొత్తం రూ. 2.70 కోట్లను ప్రకటించారు. దీంతో వీరందరూ సోమవారం ఉదయాన్నే సచివాలయం చేరుకుని సీఎం జయలలితను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేశారు. ఈ రత్నాలను సీఎం జయలలిత ఘనంగా సత్కరించారు. వీరందరికీ చెక్కుల రూపంలో ప్రకటించిన నగదు ప్రోత్సాహం అందజేశారు. మరింతగా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా పరంగా తమిళనాడు ఖ్యాతిని మరింత పెంచినందుకు గాను ఈ రత్నాలను ప్రత్యేకంగా సీఎం జయలలిత అభినందించారు.
మరిన్ని సాధిస్తాం: సత్కారం అనంతరం వెలుపలకు వచ్చిన క్రీడారత్నాలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జయలలితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రోత్సాహం మరింత బాధ్యతను పెంచిందనిపేర్కొన్నారు. అనేక క్రీడల్లో మరిన్ని పతకాల సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరం తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటామని వివరించారు. ఈ నగదు ప్రోత్సాహం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
సీఎం జయలలిత తమకే కాకుండా క్రీడారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని, ఆమె ఆకాంక్ష మేరకు మరెందరో క్రీడాకారులు ఇక్కడి నుంచి అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ప్రతి క్రీడా కారుడు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ ఆకాంక్ష మేరకు పతకాల పంట పండించాలని సూచించారు. అనంతరం ఈ ఏడుగురు క్రీడాకారులు తమ ఆనందాన్ని పంచుకుంటూ సచివాలయం వెలుపల ఒకరినొకరు, గ్రూపు ఫొటోలు తీసుకుంటూ తమ క్రీడా స్ఫూర్తిని చాటుకోవడం విశేషం.