
ప్రతీకాత్మక చిత్రం
రాంచి : మూడో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రబుద్ధుడిని రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తన స్థానంలో తమ్ముడిని పెళ్లి కొడుకుగా పంపి భారీ మూల్యమే చెల్లించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని కిరిబురు పట్టణ పోలీసు స్టేషను పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... కరీమ్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వీరిద్దరితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మూడో పెళ్లికి సిద్ధపడిన అతడు.. శుక్రవారం ఊరేగింపుగా బయల్దేరాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన కరీం భార్యలు ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్దే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పెళ్లి ఆగిపోతే వధువు తరఫు వారు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాల్సివస్తుందన్న కారణంగా తన స్థానంలో తమ్ముడిని పంపించాడు. అయితే మొదట వరుడిని కరీంగానే భావించిన వధువు బంధువులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. పెళ్లి ఆపేయడంతో పాటు ఖర్చులు రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో కరీం సోదరుడు ఆ మొత్తం చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు.
కాగా ఈ విషయం గురించి ఆఫీసర్ ఇన్‌చార్జి పూనమ్ కుజూర్ మాట్లాడుతూ.. కౌన్సెలింగ్ తర్వాత కరీం తన భార్యలతో కలిసి జీవించేందుకు అంగీకరించాడని తెలిపారు. తనకు మూడో వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. తల్లి ఒత్తిడి మేరకే ఇలా చేశానని కరీం చెప్పినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment