కొత్త రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తికి ఎంతకష్టం? | Jharkhand statehood hero now a vegetable seller in a market | Sakshi
Sakshi News home page

కొత్త రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తికి ఎంతకష్టం?

Published Mon, Feb 6 2017 8:40 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

Jharkhand statehood hero now a vegetable seller in a market

రాంచీ: కొంతమంది బాగా కష్ట పడతారు.. కానీ దానిఫలితాలు మాత్రం వేరేవారు అనుభవిస్తారు. అలా అనుభవించేవారినే సమాజం పట్టించుకుంటుందిగానీ, అందుకు కారణమైన వ్యక్తిని మాత్రం మర్చిపోతుంది. జార్ఖండ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఆయన ఒక ఉద్యమకారుడు. ఆత్మగౌరవం నిండుగా ఉన్నవాడు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం నడుంకట్టాడు. అసలు రాష్ట్ర సాధన అనే తలంపుతో తొలుత ఉద్యమ సంస్థను స్థాపించిందే ఆయనే. దాదాపు పదేళ్లపాటు ఉధృతంగా పోరాటం చేశాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకు వెళ్లాడు. అతడి కష్టానికి, ఆశలకు తగినట్లుగానే కొత్త రాష్ట్రం వచ్చింది కానీ, ఇప్పుడా వ్యక్తి ఓ మార్కెట్‌ మూలన కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అదే మరోచోట అయితే, సత్కారాలు, పదవుల సంగతి ఎట్లున్నా కనీసం మర్యాదతో వ్యవహరించేవారేమో.. పూర్తి వివరాల్లోకి వెళితే..

బినోద్‌ భగత్‌ అనే వ్యక్తి జార్ఖండ్‌ రాష్ట్రం కోసం తొలుత సమరశంఖం పూరించారు. ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ స్థాపించి క్షేత్ర స్థాయి నుంచి ఉద్యమానికి ఊపిరిలూదాడు. అర్థశాస్త్రం, జర్నలిజంలో రాంఛీ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ధనబాద్‌లో అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టారుగా పనిచేశారు. అయితే, ఎప్పుడైతే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఊపొచ్చిందో అప్పుడే ఆయన 1986లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటంలోకి దూకారు. దాదాపు పదేళ్లపాటు విస్తృతంగా పనిచేశారు. జైలుకు వెళ్లారు. 1995లో జార్ఖండ్‌ను స్వతంత్ర ప్రతిపత్తిగల మండలిగాప్రకటించిన సమయంలో ఆయన కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు.

అయితే, సహజంగానే ఆత్మాభిమానం కల వ్యక్తి కావడంతో కొందరు అవినీతిపరులతో మసలలేకపోయారు. 2000లోనే బిహార్‌ నుంచి విడివడి జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆయన కింద పనిచేసిన వారు సైతం ఇప్పుడు గొప్పగొప్ప పదవులు అనుభవిస్తూ దర్జాగా తిరుగుతుండగా ఆయన మాత్రం కూరగాయాలు అమ్ముకుంటున్నారు. ‘ఆర్థిక సమస్యల కారణంగా ఒకప్పుడు నేటి ప్రధాని మోదీ టీ అమ్మేవారు. ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితులతో కూరగాయలు అమ్ముకుంటున్నాను.

1986లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యేక జార్ఖండ్‌కోసం కష్టపడ్డాను. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. అవినీతి చర్యలకు పాల్పడి డబ్బు సంపాధించేకంటే ఇదే మంచి పని. నాకు సంతృప్తి దొరుకుతుంది. నా జీవితంలో ఇదే కొంత ఇబ్బందికరమైన దశ. అయితే, త్వరలోనే వెళ్లిపోతుంది’ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 55 ఏళ్ల వయసులో ఉన్న ఆయన జార్ఖండ్‌ మైనింగ్‌పై పరిశోధన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement