
జేఎన్‌యూలో దళిత విద్యార్థి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన దళిత విద్యార్థి ముత్తుకృష్ణన్ (27) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా విహార్‌లో మిత్రుడి గదిలో ఆయన ఉరేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం స్నేహితుల గదికి వచ్చిన ముత్తుకృష్ణన్ (రజినీ క్రిష్).. అనంతరం పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకున్నారని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే క్రిష్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ‘కృష్ణన్ గత కొంతకాలంగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడని తెలిసింది’ అని దక్షిణ ఢిల్లీ ఏసీపీ చిన్మయ్ బిస్వాస్ వెల్లడించారు. మృతుని వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు.
తమిళనాడులోని సేలంకు చెందిన ముత్తుకృష్ణన్ జేఎన్‌యూలో సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్‌లో ఎంఫిల్ చేస్తున్నారు. ‘ఎంఫిల్, పీహెచ్‌డీ అడ్మిషన్లలో సమానత్వం చూపటం లేదు. వెనుకబడిన వర్గాలకు సమానత్వం అందనపుడు మరేమిచ్చినా లాభం లేదు. సమానత్వంపై ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ ఇచ్చిన సిఫార్సులనూ తిరస్కరించారు. యూనివర్సిటీలో నిరసనలు చేపట్టేందుకూ అవకాశం లేదు’ అని మార్చి 10న ఫేస్‌బుక్‌లో చేసిన చివరి పోస్టులో ముత్తుకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య నిరసనల్లో ఈయన చురుగ్గా వ్యవహరించారు. అంబేడ్కర్ విద్యార్థి సంఘం(ఏఎస్‌ఏ) లోనూ ముత్తుకృష్ణన్ కీలకంగా ఉన్నారు.