
సాక్షి, న్యూఢిల్లీ : స్టార్ హోటళ్లకు వెళ్లినప్పుడు చేతి వాటం చూపించి నచ్చిందేదో ఎత్తుకు రావడం కొందరికి అలవాటుగా ఉంటుంది. స్టార్ హోటళ్లకు వెళ్లే స్థోమతలేని వారు అదృష్టం అడ్డంపడి అనుకోకుండా స్టార్ హోటల్‌కు వెళితే అందుకు గుర్తుగా ఏదో ఒకటి తస్కరించి తెచ్చుకుంటారు మరికొందరు. అంతేకాకుండా తరచూ స్టార్ హోటళ్లకు వెళ్లే వాళ్లు, అంతటి స్థోమత ఉన్నవారిలో కూడా ఇలాంటి పాడుబుద్ధి కలిగిన వారుంటారని పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా మనకు తెల్సిందే. పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులు కూడా చేతివాటం చూపిస్తారని తాజాగా వెల్లడైంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంట లండన్ వెళ్లిన జర్నలిస్టులు అక్కడ ఓ స్టార్ హోటల్‌లో అక్కడి ప్రభుత్వం ఇచ్చిన విందులో పాల్గొన్నారు. వెండి పాత్రలు, వెండి కంచాల్లో, వెండి చెంచాలతో స్వదేశీ వంటకాలతోపాటు భారతీయ వంటకాలను కూడా వడ్డించడంతో జర్నలిస్టులంతా లొట్టలేసుకుంటూ తెగతిన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కొందరు శుభ్రంగా ఉన్న వెండి పాత్రలను, వెండి చెంచాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు చేతివాటం చూపించారు. విందు జరిగిన హాలులో ఉన్న సీసీటీవీ కెమేరాలన్నీ ఈ దృశ్యాలను చక్కగా రికార్డు చేశాయి.
జర్నలిస్టులను రెడ్ హాండెడ్‌గా పట్టుకోకుండా అనంతరం విందు ఏర్పాటు చేసిన వారికి జరిగిన విషయం ఫిర్యాదు చేయాలకున్నది హోటల్ యాజమాన్యం. కానీ లండన్ విదేశాంగ శాఖ ఈ విందును ఏర్పాటు చేసిన కారణంగా రాద్ధాంతం జరిగితే పరువు పోతుందని భావించిన యజమాన్యం. ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో తమ సెక్యూరిటీ సిబ్బందికి తగిన ఆదేశాలను జారీ చేసింది. ఆ సిబ్బంది చేతివాటం చూపిన జర్నలిస్టులందరి దగ్గరికి వెళ్లి తమ నిర్వాకం సీసీటీవీ కెమేరాల్లో రికార్డయిందని, ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడనే వదిలేసి వెళ్లాలని హెచ్చరించారు. ఇబ్బందిపడ్డ జర్నలిస్టులు వారు చెప్పినట్లే చేసి మౌనంగా తలొంచుకొని బయటకు దారి తీశారు.
వారిలో ఒక జర్నలిస్టు మాత్రం సెక్యూరిటీ గార్డు ఎంతగా హెచ్చరించినా వినలేదు. తాను దేన్ని చోరీ చేయలేదని, అవసరమైతే తన బ్యాగ్‌ను తనిఖీ చేసుకోవచ్చని ప్రతి సవాల్ చేశారు. ‘బాబు! నీవు దొంగతనం చేసి పాత్రను నీ బ్యాగులో పెట్టుకోలేదు. తోటి జర్నలిస్టు బ్యాగులో పెట్టావ’ ని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ తెల్లబోయాడు. చెప్పినప్పుడు వినకుండా అంతగా వాదించినందుకు, గొడవ పడ్డందుకు ఆ జర్నలిస్టును ముందుగా పోలీసులకు అప్పగిద్దామనుకున్న హోటల్ యాజమాన్యం. చివరకు ఆయనకు 50 పౌండ్లు, అంటే 4,500 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించిన సదరు జర్నలిస్ట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంట భారత్‌కు వెన్నంటి వచ్చారు. ఈ విషయాన్ని ‘అవుట్‌లుక్’తో పాటు కొన్ని బెంగాల్ పత్రికలు ధ్రువీకరించాయి. చేతివాటం చూపిన జర్నలిస్టుల పేర్లను అవుట్‌లుక్ వెల్లడించలేదు. బెంగాల్ పత్రికలు ముందుగా వెల్లడించినా తర్వాత వాటిని తొలగించింది.
ఈ సంఘటన లండన్‌లో మమతా బెనర్జీ గౌరవార్థం ఇచ్చిన విందులో అని పేర్కొన్నారుగానీ, ఎప్పుడు, ఏ హోటల్‌లో జరిగిందో తెలియజేయలేదు. మమతా చివరిసారి లండన్‌లో పర్యటించిందీ మాత్రం గత నవంబర్ నెలలో. చేతి వాటం చూపిన జర్నలిస్టుల్లో బెంగాల్ వాళ్లే ఎక్కువ ఉన్నారు. సీసీటీవీ కెమేరాలున్నా వారు చోరీ చేయడానికి కారణం అవి పనిచేయకపోవచ్చనే అభిప్రాయమేనని, ఎందుకంటే బెంగాల్లో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పనిచేయవని తోటి జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment