
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ ఆరోపణల నేపథ్యంలో న్యాయవ్యవస్థలో నెలకొన్న సంక్షోభం ఇంకా సమసిపోలేదు. ‘న్యాయవ్యవస్థలో ముందుకొచ్చిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు..రెండు మూడు రోజుల్లో న్యాయమూర్తుల మధ్య పొడసూపిన విభేదాలు పరిష్కారమవుతా’యని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ వారాంతంలో సంక్షోభం సమసిపోతుందని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చెప్పారు. ఇక కీలక కేసులను విచారించే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు రెబెల్ జడ్జీలకు చోటుకల్పించకపోవడంతో సమస్యకు పరిష్కారం లభించలేదని వెల్లడైంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై నలుగురు సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు బాహాటంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసుల కేటాయింపు సవ్యంగా జరగడం లేదని, సుప్రీం కోర్టులో పరిస్థితి సరిగా లేదని వారు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.