సాక్షి, బెంగళూరు: నేటి ఆధునిక జీవనశైలితో పా టు జంక్‌ఫుడ్ కూడా ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమించింది. వద్దు వద్దని వైద్యులు ఎంత హెచ్చరిస్తున్నా ఎంతో మంది వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. జంక్ ఫుడ్ వల్ల అనారోగ్యం బారిన పడేవారిలో పెద్దలే కాకుండా చిన్నపిల్లలూ ఉంటున్నారు. జంక్‌ఫుడ్ వల్ల బాలల్లో ఎనీమియా (రక్తహీనత), ఐరన్ లోపం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
40 శాతం మందికి ఎనీమియా
- నగరానికి చెందిన ప్రైవేటు ఆరోగ్యసంస్థ నిర్వహించిన సర్వేలో కూడా జంక్ ఫుడ్ వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లు తేలింది. పిజ్జా, బర్గర్లు, నూడుల్స్, చిప్స్, డోనట్స్ తదితరాలు ఎక్కువగా తినే చిన్నపిల్లల్లోని రక్త నమూనాలను పరిశీలించి పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు.
- బెంగళూరులోని సుమారు 0– 20 ఏళ్లలోపు వ యసున్న వారిలో దాదాపు 40 శాతం మందిని ఎనీమియా పీడిస్తోంది.
- 0–10 ఏళ్ల లోపు చిన్నారుల్లో 35 శాతం మందికి, 10–20 ఏళ్ల లోపు పిల్లల్లో 41 శాతం మందికి రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం చాలా తక్కువస్థాయిలో ఉంది.
తింటే.. ఐరన్ లోపమే
ఎక్కువమంది పిల్లల్లో ఐరన్ లోపం వల్ల, మరికొందరిలో జన్యుపరంగా ఎనీమియా వస్తున్నట్లు సర్వేలో గుర్తించారు. అలాగే అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలను ఎముక మజ్జ ఉత్పత్తి చేయకపోవడం ఇతర ముఖ్య కారణం. వీటన్నింటికి జంక్/ ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడడమే కారణమని పరిశోధకులు కనుగొన్నారు. ఈ సర్వేలో మొత్తం 5,124 మంది చిన్నారుల రక్త నమూనాలను సేకరించగా 2,063 మంది హిమోగ్లోబిన్ స్థాయిలు అసాధారణంగా ఉన్నట్లు తేలింది. జంక్ ఫుడ్‌లో అధికంగా వాడే ఉప్పు, చక్కెర, నూనెలు, కొవ్వుల వల్ల కేవలం ఎనీమియా మాత్రమే కాకుండా ఊబకాయం, స్థూలకాయం కూడా సంభవించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment