
భార్య లలితతో రోహిత్ (ఫైల్)
న్యూఢిల్లీ: భార్య ఆత్మహత్యలో అరెస్టైన జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ కుమార్ చిల్లర్ కు ఢిల్లీ కోర్టు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది. ఆదివారం అతడిని డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. అక్టోబర్ 25 వరకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా న్యాయమూర్తి అంగీకరించారు. రెండు రోజుల పాటు అతడిని పోలీసులు ఇంటరాగేట్ చేయనున్నారు.
నావికా దళంలో పనిచేస్తున్న అతడిని ఈనెల 21న ముంబైలో అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇదే కేసులో లొంగిపోయిన రోహిత్ తండ్రి విజయ్ సింగ్ కు కోర్టు నవంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రోహిత్ భార్య లలిత అక్టోబర్ 17న పశ్చిమ ఢిల్లీలోని తన అపార్టుమెంటులో దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో ఆమె పేర్కొంది. ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలతో రోహిత్, అతడి తండ్రిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.