
ఆమె ఆత్మహత్య.. పరారీలో రోహిత్!
రోహిత్‌కుమార్ చిల్లర్.. ఇటీవల బాగా ప్రజాదరణ పొందిన ప్రో కబడ్డీ లీగ్ చూసేవారికి ఈ ఆటగాడు బాగా తెలిసినవాడే. జాతీయ కబడ్డీ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో.. అతను చిక్కుల్లో పడ్డాడు. రోహిత్‌కు వ్యతిరేకంగా పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో.. అతను, అతని కుటుంబం పరారయింది. దీంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.
26 ఏళ్ల రోహిత్‌కుమార్ భార్య లలిత దబాస్ సోమవారం రాత్రి ముంబైలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో రోహిత్‌కుమార్ ఢిల్లీలో ఉన్నాడు. రోహిత్ కుటుంబం ఢిల్లీ శివారులో నివసిస్తోంది. గత మార్చిలో తన కన్నా రెండేళ్లు పెద్దదైన లలితను రోహిత్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో రోహిత్‌తో వేరయి గతకొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న లలిత తన ఆత్మహత్యకు ముందుకు ఓ లేఖ, రెండున్నర గంటల వాయిస్ మెసేజ్ రికార్డు చేసింది. కట్నం కోసం రోహిత్‌కుమార్, అతని కుటుంబసభ్యులు తనను తీవ్రంగా వేధించారని, వారితో వేగలేక ఒంటరిగా ఉంటున్నట్టు పేర్కొంది. లలిత ఆత్మహత్య గురించిన సమాచారం అందించినా రోహిత్‌గానీ, అతని కుటుంబసభ్యులుగానీ పోలీసుల ముందు హాజరుకాలేదని, దీంతో పరారీలో ఉన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు రెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు పోలీసులు తెలిపారు.