కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి లైన్ ప్రారంభం
వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ/కళ్యాణదుర్గం రూరల్: రాయదుర్గం–తుముకూరు రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ట్రాక్ నిర్మాణం పూర్తయిన కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి మార్గాన్ని కేంద్ర మంత్రులు సురేష్‌ప్రభు, అశోక్‌గజపతిరాజు బుధవారం ఢిల్లీ నుంచి వీడియోలింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్(జీఎం) ఏకే గుప్తా, హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) ఏకే జైన్, చీఫ్ ఆపరేషన్ మేనేజర్ జీజే ప్రసాద్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌గుప్తా, సీపీఆర్వో విజయ తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి రైల్వేలైన్ (23 కి.మీ.) ప్రారంభమవ్వడంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం మీదుగా తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు (57477/57478)ను కదిరి దేవరపల్లి వరకు పొడిగించారు. ఈ రైలును బుధవారం కళ్యాణదుర్గంలో రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపి నూతన మార్గంలోకి పంపించారు. ఈ రైలు ప్రతిరోజూ తిరుపతిలో రాత్రి 10.30కి బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కదిరి దేవరపల్లికి చేరుకుంటుంది. తిరిగి అదేరోజు కదిరి దేవరపల్లిలో మధ్యాహ్నం 1.20కి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.20కి తిరుపతి చేరుకుంటుంది. కాగా, ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.