ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కన్హయ్య
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మరో 19 మంది విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కన్హయ్యతోపాటు ఉమర్ ఖలీద్, అనీర్బన్ భట్టాచార్యలపై విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు బుధవారం అర్థరాత్రినుంచి దీక్షలో కూర్చున్నారు. అత్యున్నత విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదనీ అదొక మాయ అని, అందుకే తమకు విధించిన శిక్షలను తిరస్కరిస్తున్నామని వివరించారు.
గతంలో కన్హయ్యను పోలీసులు అరెస్టు చేసిన స్థలం వద్దే విద్యార్థులు దీక్షాస్థలిని ఏర్పాటు చేసుకున్నారు. కన్హయ్య మాట్లాడుతూ..‘పరీక్షల సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే విద్యార్థులెవరూ ఆందోళనకు దిగే అవకాశముండదనే విశ్వవిద్యాలయం ఇప్పుడు మాకు శిక్ష విధించింది. పోరాడుతూనే పరీక్షల్ని రాయగలం’ అని అన్నారు. అఫ్జల్‌గురు ఉరికి వ్యతిరేకంగా సమావేశాన్ని నిర్వహించడం, దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో గతంలో వీరు అరెస్టయ్యి బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడ వీరిపై విశ్వవిద్యాలయం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.