సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్‌లో పెను దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలు మహిళలపై లైంగిక దాడులను ప్రోత్సహించేవిలా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడుతూ ఆయన క్షమాపణను డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ తేల్చిచెప్పినా ఆయన వ్యాఖ్యలపై పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధాని నిత్యం మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారని, దాన్ని తాము గౌరవిస్తామని అయితే వాస్తవంగా దేశంలో జరుగుతున్నదేంటని కనిమొళి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ మేకిన్ ఇండియా జరగకపోయినా దేశంలో మహిళలపై లైంగికదాడులు మాత్రం జరుగుతున్నాయని ఇదే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని చెప్పారు. కనిమొళి వ్యాఖ్యలపైనా స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కూడా మీరు పార్టీలకు అతీతంగా వ్యవహరించలేకపోతున్నారని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment