బెంగళూరు: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు పయనమైన వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నందున వలస కార్మికులకు అక్కడే ఉండాల్సిందిగా కోరుతూ రైళ్లను రద్దు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రాపర్టీ బిల్డర్స్‌తో సమావేశమైన అనంతరం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో వ్యాపారాలు, భవన నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికుల ప్రయాణాలు అనవసరం అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.(2 వేల కి.మీ. సైకిల్‌పై ప్రయాణించనున్న వలస కార్మికులు)
అదే విధంగా ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 3500 బస్సులు, రైళ్లలో దాదాపు లక్ష మందిని స్వస్థలాలకు పంపించామని యడియూరప్ప తెలిపారు. ఉపాధి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నందున రాష్ట్రంలోనే ఉండిపోవాలని వలస కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయం గురించి వలస కార్మికుల తరలింపు ఇన్‌చార్జి, నోడల్ ఆఫీసర్ మంజునాథ్ ప్రసాద్ రైల్వేశాఖకు మంగళవారం లేఖ రాశారు. బుధవారం కర్ణాటక నుంచి బయల్దేరే రైళ్లను రద్దు చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాదాపు 10 వేల మంది కార్మికులు బిహార్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. (64 విమానాల్లో 15 వేల మంది..)
ఈ నేపథ్యంలో మంగళవారం నిర్మాణ సంస్థలతో భేటీ అయిన సీఎం యడియూరప్ప.. మెట్రో, బీఐఏఎల్, ఇతర ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నందున వారిని ఇక్కడే నిలిచిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉపాధి పనులు ప్రారంభం అవుతాయి కాబట్టి రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖకు లేఖ రాశాం’’ అని పేర్కొన్నారు. కాగా వలస కార్మికుల తరలింపునకై రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడపాల్సిందిగా ప్రభుత్వం రైల్వే శాఖను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు రెండు శ్రామిక్ రైళ్లు చిక్‌బన్వారా నుంచి లక్నో, మాలూర్ నుంచి బార్‌కకానా(జార్ఖండ్)కు బయల్దేరాయి. దాదాపు 2400 మంది ప్రయాణికులు తమ స్వస్థలాలకు చేర్చనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment