
బెంగళూరు: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఆయన ఢిల్లీ ఖాన్ మార్కెట్‌లోని లోక్ నాయక్ భవన్ ఈడీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. ‘ఈడీ ఎదుట హాజరవడం నా బాధ్యత. వారు నాకు సమన్లు ఇచ్చారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వారెందుకు పిలిచారో అర్థం కావడం లేదు. వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని శివకుమార్ చెప్పారు. మనీలాండరింగ్ కేసులో హాజరు కావాల్సిందిగా గతంలో ఈడీ సమన్లు జారీ చేయడంతో, వాటిని సవాల్ చేస్తూ శివకుమార్ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టులో గురువారం ఆయనకు చుక్కెదురవడంతో ఈడీ తాజాగా శుక్రవారం మధ్యాహ్నం కల్లా హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది.
తాను ఈ సమన్లపై న్యాయపరమైన పోరాటం చేస్తానని, కుటుంబ కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల ఈడీ ఎదుట హాజరు కాలేనని ఉదయం చెప్పారు. అయినప్పటికీ తనకు చట్టంమీద గౌరవం ఉందంటూ సాయంత్రం ఆరున్నర గంటలకు ఈడీ ఎదుట హాజరయ్యారు. 2017 గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీకి దొరక్కుండా బెంగళూరు రిసార్ట్‌లలో దాచడంలో కీలక పాత్ర పోషించినందుకే బీజేపీ ఐటీ, ఈడీ దాడులు జరుపుతోందని ఆరోపించారు. హవాలా మార్గం ద్వారా కోట్ల రూపాయలను బెంగళూరు, ఢిల్లీలలో దాచారని ఆరోపిస్తూ ఏ1గా శివకుమార్‌తో పాటు సచిన్ నారాయణ్, ఆంజనేయ హనుమంతయ్య, ఎన్ రాజేంద్రలపై గతేడాది సెప్టెంబర్‌లో కేసులు నమోదయ్యాయి. వీరు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టే కుట్ర పన్నారని ఆదాయపన్ను శాఖ ఆరోపించింది. 2017 ఆగస్టులో శివకుమార్‌కు చెందిన దాదాపు రూ. 20 కోట్ల నల్లధనాన్ని పట్టుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment