ఆసుప్రతిలో చేరిన మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయనను చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించినట్లు మాజీ సీఎం సన్నిహితులు తెలిపారు. మైసూర్, ఛిత్రదుర్గ జిల్లాల పర్యటనను ముగించుకున్న కుమారస్వామికి జ్వరంతో పాటు గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఈ క్రమంలో ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారని సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు.
శ్వాసకోస సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న కుమారస్వామికి ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు బ్లడ్ టెస్ట్ సహా అన్ని రకాల టెస్టులు చేశామని, ఎక్స్ రే తీశామని.. మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ తో మాజీ సీఎం ఇబ్బంది పడుతున్నారని విక్రమ్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సతీష్ మీడియాకు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లోనే కుమారస్వామిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. డాక్టర్ల సలహా మేరకు నాలుగైదు రోజులు తాను రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలలో పాల్గొనలేనని ఓ ప్రకటనలో కుమారస్వామి వెల్లడించారు.