
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కాలుష్య నియంత్రణతో పాటు సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. వినూత్న ఆఫర్లను ప్రకటిస్తూ పెట్టుబడులను ఆకర్షించడమే కాక మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ప్రత్యేక పాలసీని రూపొందించగా, ఇది త్వరలోనే అమల్లోకి రాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకొచ్చే సంస్థలకు ఐదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడేను ప్రకటించనుంది. ల్యాండ్ కన్వర్షన్ ఫీజు మొత్తాన్ని (100 శాతం) రీయింబర్స్ చేయడంతోపాటు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మొత్తంలో 50 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించనుంది. ఈ వాహనాల టెస్టింగ్ ట్రాక్‌ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ప్రభుత్వమే నిర్మించనుంది.
వాహనాల చార్జింగ్ పాయింట్లకు అవసరమైన స్థలాన్ని స్థానిక సంస్థలే సమకూర్చనున్నాయి. ఇక కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకొచ్చే పెట్టుబడిదారులకే కాకుండా ఆ వాహనాలు వినియోగించే వారికి (నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు) కూడా అనేక రాయితీలకు ప్రభుత్వం కల్పించనుంది. ముఖ్యంగా రోడ్, రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించిన కోర్సులు (డిప్లొమో నుంచి పీహెచ్‌డీ వరకూ) చదివే విద్యార్థుల ఫీజుల్లో 50 శాతం వరకూ రీయింబర్స్ చేయనుంది. దీని వల్ల ఎక్కువ మంది ఈ కోర్సులు చదవడానికి ముందుకు వస్తారని, తద్వారా పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను రాష్ట్రం నుంచే అందించడానికి వీలవుతుందనేది ప్రభుత్వ భావిస్తోంది.