కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్
♦ మెహబూబాను కలసిన సోనియా
♦ తర్వాత గడ్కారీ పరామర్శ
శ్రీనగర్: గవర్నర్ పాలన అమల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ సమీకరణాలపై చర్చా మొదలైంది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆదివారం పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని కలుసుకున్నారు. మెహబూబా తండ్రి, మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతిపై సంతాపం తెలిపారు. తర్వాత కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కారీ కూడా మెహబూబాను కలుసుకుని పరామర్శించారు. దీంతో ఈ భేటీలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సయీద్, మెహబూబాలు 1999 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. 2002-08 మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నడిచింది.
అయితే పీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని, ప్రభుత్వ ఏర్పాటులో పీడీపీ నిర్ణయంపై తాము చర్చిచాల్సి ఉందని గవర్నర్‌కు లేఖ రాశామని మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నిర్మల్ సింగ్ అన్నారు. సయీద్ గత గురువారం చనిపోవడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన సోనియా విమానాశ్రయం నుంచి నేరుగా మెహబూబా ఇంటికెళ్లి 20 నిమిషాలు అక్కడున్నారు. రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మీర్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. సయీద్ మంచి పాలకుడని, సహనం, భిన్నత్వాన్ని గౌరవించే భారతీయ విలువలకు నిదర్శనమని సోనియా నివాళి అర్పించారు.
కాగా, సోనియా పరామర్శకు రాజకీయ ప్రాధాన్యం లేదని ఆజాద్ మీడియాకు తెలిపారు. మరోవైపు.. మెహబూబాను పరామర్శించిన అనంతరం గడ్కారీ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రం తరఫున సంతాపం తెలపడానికే వచ్చాను. రాజకీయాలు మాట్లాడను’ అని అన్నారు. గత ప్రభుత్వంలో పీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇంతవరకు మెహబూబా తదుపరి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడానికి అధికారికంగా మద్దతు తెలపకపోవడం గమనార్హం. సీఎం పదవి విషయంలో రెండు పార్టీలమధ్య మంతనాలు, బేరసారాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పీడీపీ ఇప్పటికే తమ పార్టీకి చెందిన మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మెహబూబాకే మద్దతునిస్తున్నారని గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాకు లేఖ సమర్పించింది. తన తండ్రి సంతాప దినాలు ముగిసేవరకు(ఆదివారం) తాను పదవిచేపట్టబోనని మెహబూబా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.