పేరు చెప్పకుండా మద్దతు కావాలంటే ఎలా?
- బీజేపీ కమీటీని ప్రశ్నించిన సోనియా.. ఏచూరిదీ అదే మాట
- కాంగ్రెస్, సీపీఎంతో బీజేపీ కమిటీ మంతనాలు ప్లాప్
- రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా గమనించిన చర్చలు అత్యంత పేలవంగా ముగిశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు ఏర్పాటైన బీజేపీ త్రిసభ్య కమిటీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరిని కలిసింది. ఒక్కోటి దాదాపు 30 నిమిషాల పాటు భేటీలు సాగాయి.
తొలుత సోనియాను కలిసిన వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌లు.. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అభిప్రాయమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘మీ అభ్యర్థి ఎవరో చెప్పండి.. అవసరమైతే మేమే(ఎన్డీఏనే) మద్దతిస్తాం’ అని బీజేపీ నేతలు సోనియాతో అన్నట్లు సమాచారం. సమాధానంగా.. ‘మద్దతు కోసం వచ్చిన మీరు ఎవరికి మద్దతివ్వాలో ఆ పేరు చెప్పకుంటే ఎలా?’ అని సోనియా అన్నట్లు తెలిసింది.
‘వాళ్లు(బీజేపీ) అభ్యర్థుల పేర్లు చెప్పనేలేదు. అలాంటప్పుడు దీనిని చర్చలని కూడా అనలేం’ అని సోనియాతో బీజేపీ కమిటీ భేటీపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ‘పేర్లు చెప్పకుంటే ప్రక్రియ ముందుకు సాగనేసాద’ని మరో నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు.
వచ్చారు.. వెళ్లారు..: ఏచూరి
సోనియాతో భేటీ అనంతరం బీజేపీ నేతలు వెంకయ్య, రాజ్‌నాథ్‌లు నేరుగా సీపీఎం కేంద్రకార్యాలయానికి వెళ్లి సీతారం ఏచూరిని కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సీపీఎం అభిప్రాయాన్ని అడిగితెలుసుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాఉ. భేటీ అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అయితే ఎన్డీఏ అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. కాసేపటికి వెళ్లిపోయారు. అయినా పేరు చెప్పకుండా మద్దతెలా ఇస్తాం?’ అని ఏచూరి పేర్కొన్నారు.