'వెంకయ్య వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగించండి'
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించడాన్ని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరి తప్పుబట్టారు. సీపీఎం తెలంగాణ కు అనుకూలమని వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. తమ పార్టీపై బీజేపీ చేస్తున్నవ్యాఖ్యలు అబద్ధమని ఏచూరి తెలిపారు. కాంగ్రెస్-బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కారణంగానే తమపై నిందలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనలు చేస్తే దేశంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
వెంకయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్-బీజేపీలు బలిపెట్టాయని ఏచూరి విమర్శించారు. తొలి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని చీల్చడం దారుణం కాక మరేమిటని సీతారం ఏచూరి ప్రశ్నించారు.