నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వండి
స్థానిక అవసరాలను బట్టే పథకాల రూపకల్పన
నీతి ఆయోగ్ భేటీలో సీఎం కేసీఆర్
రాష్ర్టంలో పలుపథకాలకు నిధులివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి
ప్రత్యేకాభివృద్ధి ప్యాకేజీ కోసమూ విన్నపం
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక అవసరాలకు తగినట్టుగా నిధులివ్వాలని, కేంద్ర పథకాలను కూడా రాష్ట్రాలకనుగుణంగా మలచాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఆదివారం ఇక్కడ జరిగిన ‘నీతి ఆయోగ్’ పాలకమండలి సమావేశంలో ఆయన ఐదు నిమిషాలపాటు మాట్లాడారు. రాజీవ్ విద్యామిషన్ పథకాన్ని ఉదహరిస్తూ.. ఒక్కో రాష్ర్టంలో ఒక్కో విధంగా ఉన్న అవసరాలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. కేంద్ర పథకాల కొనసాగింపుపై నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీ వేయాలని కోరారు. దీంతో కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసించినట్టు సమాచారం. కేంద్ర నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేయాలన్నారు. కాగా, ఈ సమావేశం అనంతరం ప్రధానితో కేసీఆర్ ఐదు నిమిషాలపాటు విడిగా మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య అమలు, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వీటన్నింటికీ నిధులు కావాలని కోరారు. అలాగే తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మంజూరు చేయాలని సీఎం విన్నవించారు.