
మహారాష్ట్రలో కేసీఆర్ పుట్టినరోజు
రాజ్ భవన్‌లో కేక్ కట్ చేయించిన
గవర్నర్ విద్యాసాగర్‌రావు దంపతులు
కేసీఆర్‌కు ప్రధాని మోదీ, నరసింహన్, చంద్రబాబు శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్, ముంబై: సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ముంబైకి వెళ్లిన సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్ర రాజ్‌భవన్‌లోనే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ దంపతులు స్వయంగా కేక్ తెప్పించి కేసీఆర్‌తో కట్ చేయిం చారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు, రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులకు గవర్నర్ విందు ఇచ్చారు. కాగా.. పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్‌కు ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలి పారు. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సీఎంకు పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఎంపీ లు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, పాటిల్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఉన్నతాధికారులు స్వయంగా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ ప్రాంతాలను సందర్శించిన కేసీఆర్
రాజ్‌భవన్‌లో పుట్టినరోజు వేడుకలకు ముందు ముంబైలోని ప్రసిద్ధ దేవాలయమైన సిద్ధి వినాయక ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గేట్ వే ఆఫ్ ఇండియాతో పాటు నారీమాన్ పాయింట్‌లోని వివిధ పరిసరాలను తిలకిస్తూ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముంబై పర్యటన సందర్భంగా వివిధ తెలుగు సంఘాల నాయకులు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ముంబైలోని తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.