ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ నిర్లక్ష్యం
ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ రిలే నిరాహారదీక్షలో మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్గీకరణకు అనుకూలమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పదేపదే ప్రకటనలు చేయిస్తూ మభ్యపెడుతున్నారు. కడియం గతంలో ప్రకటించినట్టుగా సీఎం మంగళవారంలోగా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకురావాలి. ఎజెండాలో ఎస్సీ వర్గీకరణ లేకుండా కేసీఆర్ ఢిల్లీ రావొద్దు’’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్‌లో చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా సోమవారం రెండో రోజు ఆయన దీక్షా సభలో మాట్లాడారు. కేసీఆర్ మాదిగలపై కపట ప్రేమ ప్రదర్శిస్తూ వర్గీకరణ ఉద్యమాన్ని చీల్చడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం అనంతరం కేసీఆర్ పదిసార్లు ఢిల్లీలో పర్యటించారని, అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినా ఎస్సీ వర్గీకరణపై మాత్రం ఒక్క సందర్భంలోనూ మాట్లాడలేదని మంద కృష్ణ మండిపడ్డారు.
బాబువి నక్కజిత్తులు...
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీ వె ళ్లి సాధించుకుందామని చెప్పి అధికారంలోకి రాగానే ఏపీ సీఎం చంద్రబాబు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని మంద కృష్ణ దుయ్యబట్టారు. ఏపీలోనే అనేక సమస్యలుంటే పార్లమెంటులో టీడీపీ ఎంపీలతో మాట్లాడించాల్సింది పోయి విదేశాలు తిరగడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిగలకు చేస్తున్న మోసాలను అన్ని వర్గాలు గమనిస్తున్నాయని, ఆయన వైఖరి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నా రు. ఎస్సీ వర్గీకరణపై సూటిగా మాట్లాడే దమ్ము లేక చంద్రబాబు నక్కజిత్తులు ప్రదర్శిస్తూ కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతున్నారని ఆరోపించారు.
బాబు ఇకనైనా ఈ అంశంపై ప్రధానితో మాట్లాడి వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి తన ను తాను శుద్ధి చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై మీనమేషాలు లెక్కించొద్దని, తక్షణమే బిల్లుపెట్టి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. రెండో రోజు రిలే దీక్షలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధికార ప్రతినిధి బిరుదు రవి మాదిగ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి ఓదేలు పాల్గొన్నారు.