నేడు ప్రణబ్, మోడీలతో కేసీఆర్ భేటీ
పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్న తెలంగాణ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన శని, ఆదివారం రెండు రోజులపాటు ఇక్కడే ఉండి రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో, తొమ్మిదిన్నరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అవుతారు.
6.15కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుంటారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కూడా కేసీఆర్ కలిసే అవకాశాలున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు కూడా సీమాంధ్రలాగా ప్రత్యేక హోదా కల్పించాలని, పోలవరం ముంపు ప్రాంతాలపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవడంతోపాటు పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేసీఆర్ కోరనున్నారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీ రావడం ఇదే తొలిసారి.