
‘సీఎం ఆఫీసుకు రాడుగానీ సర్కార్ 3కి వెళ్లాడు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు సీఎం ఆఫీసుకు వెళ్లేందుకు సమయం ఉండదుగానీ, సర్కార్ 3 సినిమాకు మాత్రం వెళ్లారని అన్నారు. గత ఏడాది మొత్తంలో రెండుసార్లు మాత్రమే ఆయన తన కార్యాలయానికి కేజ్రీవాల్ వెళ్లారని చెప్పారు. ‘కేజ్రీవాల్ స్నేహితులు, ఆయన బంధువులు ఇళ్లపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తే కేజ్రీవాల్ చేస్తున్న అవినీతి మరింత వెలుగులోకి వస్తుంది. ప్రజలను మాత్రం పూర్తిస్థాయిలో పనిచేయాలని విధులకు హాజరుకావాలనే కేజ్రీవాల్ వారికి కనిపించడం మానేశారు. కానీ, సర్కార్ 3 సినిమా చూసేందుకు మాత్రం వెళ్లారు’ అని ఆయన అన్నారు.
‘మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులందరిలో కూడా ప్రజలను అతి తక్కువ సార్లు కలిసిన ముఖ్యమంత్రి కేజ్రీవాలే. ఆయనకు ఒక పోర్ట్‌పోలియో అంటూ ఉండని, అతి తక్కువ మాత్రమే పనిచేస్తూ దాదాపు అన్ని రోజుల్లో సెలవులు తీసుకునే ఏకైక ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక్కరే’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే మిక్కిలి అవినీతి ఆరోపణల కేసులు నమోదైన సీఎంగా కూడా కేజ్రీవాల్ మిగిలిపోతారని అన్నారు. తాను ఇప్పటి వరకు ఆయన చేసిన ఎన్నో అవినీతి కార్యకలాపాల విషయాలు చెప్పానని, కానీ, ఒక్కదానికైనా ఆయన స్పందించారా అని ప్రశ్నించారు. త్వరలోనే ఆయన అవినీతి బాగోతంపై ప్రజలే మాట్లాడతారని, ఒక క్రిమినల్ మాదిరిగా కేజ్రీవాల్ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు.