
‘ఆదివారం నేను చెప్పే సీక్రెట్‌తో ఢిల్లీ వణుకుద్ది’
న్యూఢిల్లీ: తదుపరి తాను చెప్పబోయే మరో విషయం ఢిల్లీ ప్రజల్లో భూకంపం పుట్టిస్తుందని, ముఖ్యంగా ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకం పెట్టుకున్నారో వారంతా వణికిపోతారని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురై నిరహార దీక్షలో ఉన్న కపిల్ మిశ్రా చెప్పారు. శనివారం మహాత్మాగాంధీ స్మృతి వనం రాజ్ ఘాట్‌ను సందర్శించిన ఆయన అక్కడ కంటతడి పెట్టారు. లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రా ప్రస్తుతం పార్టీలో నుంచి వేటుకు గురై నిరహార దీక్షలో ఉన్న విషయం తెలిసిందే.
శనివారం బాపూ ఘాట్‌కు వెళ్లిన ఆయనను ఆరోగ్యం క్షీణించిందని, ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఒంటరినని భావిస్తున్నాను. అందుకే రాజ్ ఘాట్‌కు వచ్చాను. రేపు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళతా. రేపు నేను మరో విషయాన్ని బయటపెడతా.. దాని తర్వాత ఢిల్లీ ప్రజల ప్రకంపనలు చూస్తారు. ముఖ్యంగా ఎవరు ఆప్‌ను నమ్మారో వారు’ అని ఆయన అన్నారు. దీంతో రేపు కపిల్ మిశ్రా ఏం బయటపెట్టనున్నారో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు.