
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అంటారు పెద్దలు. ఎందుకంటే వంద మంది స్నేహితులు పంచే ఙ్ఞానాన్ని ఒక్క పుస్తక పఠనంతోనే సంపాదించవచ్చన్నది వారి ఉద్దేశం. ఈ మాటలను బలంగా నమ్ముతుంది యశోద డి షెనాయ్. చిన్ననాటి నుంచే ఇటువంటి గొప్ప లక్షణాన్ని ఒంటబట్టించుకోవడమే కాక పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ల కోసం ఏకంగా లైబ్రరీనే ఏర్పాటు చేసింది ఈ చిన్నారి. అవును యశోద వయస్సు కేవలం 12 సంవత్సరాలు. కానీ ఆమె నిర్ధేశించుకున్న లక్ష్యం మాత్రం చాలా పెద్దది.
కేరళలోని కొచ్చికి చెందిన యశోదకు చిన్ననాటి నుంచే పుస్తకాలు చదవాలనే ఆసక్తి మెండుగా ఉండేది. అన్న అచ్యుత్, తల్లి బ్రహ్మజల సహాయంతో ఎనిమిదేళ్ల నుంచే పెద్ద పెద్ద పుస్తకాలను సైతం అలవోకగా చదివేసేది. కూతురి అభిరుచిని గమనించిన యశోద తండ్రి దినేశ్ ఆమెను తరచుగా గ్రంథాలయానికి తీసుకువెళ్లి మరీ చదివించేవాడు. అలా కుదరని రోజు తన కోసం పుస్తకాలు ఇంటికి తీసుకువచ్చేవాడు. అయితే ఓరోజు పుస్తకం ఆలస్యంగా తిరిగి ఇవ్వడంతో జరిమానా పడింది. ఆరోజు తండ్రి వెంటే ఉన్న యశోదకు ఈ విషయం చిత్రంగా తోచింది. ఆనాటి ఆ సంఘటనే ఆమె స్వయంగా ఉచిత గ్రంథాలయాన్ని స్థాపించేందుకు ప్రేరణనిచ్చింది.
పుస్తకానికి డబ్బు కట్టాలా!?
‘ఓ రోజు నాన్న లైబ్రేరియన్‌కు ఫైన్ చెల్లించడం చూశాను. అప్పటిదాకా పుస్తకాలు చదివినందుకు డబ్బులు కట్టాలనే విషయం నాకు తెలియదు. అదే విధంగా ఏ పుస్తకం కూడా ఉచితంగా రాదని నాన్న చెప్పినపుడు నాలో మథనం మొదలైంది. చేతిలో పది రూపాయలు కూడా లేని వాళ్లు పుస్తకాలు కొని ఎలా చదువుకుంటారు. వారికి ఙ్ఞానం ఎలా వస్తుంది. అందుకే మా ఇంట్లోనే డాబా మీద లైబ్రరీ పెట్టాలని నిర్ణయించుకున్నా. నాన్నకు ఈ విషయం చెప్పగానే తన పెయింటింగ్స్ కోసం కేటాయించిన గదిని గ్రంథాలయంగా మార్చేందుకు అనుమతినిచ్చారు. నాకు బోలెడన్ని పుస్తకాలు కొనిపెట్టారు ’ అని లైబ్రరీ పెట్టేందుకు దారితీసిన పరిస్థితి గురించి వివరించింది.
3 వేల పుస్తకాలు ఉన్నాయి..
‘రెండువేల పుస్తకాలతో లైబ్రరీ ప్రారంభించాం. నా లైబ్రరీ గురించి నాన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అందరికీ ఫ్రీ లైబ్రరీ గురించి తెలిసింది. ప్రస్తుతం ఇంగ్లిష్, మలయాళం, కొంకణీ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రచురితమైన 3 వేల పుస్తకాలు నా లైబ్రరీలో ఉన్నాయి. చిన్నా, పెద్దా అంతా మా లైబ్రరీకి రావొచ్చు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, నవలలు, పద్యాలు, కథల పుస్తకాలు అన్నీ ఇందులో లభిస్తాయి. నా స్నేహితులు, మా స్కూల్ టీచర్లు అందరూ ఇక్కడికి వస్తారు. నా లైబ్రరీలో ఫైన్ ఉండదు కానీ పుస్తకం తీసుకున్న15 రోజుల్లోగా తిరిగి ఇచ్చేయాలి. మెట్లు ఎక్కి పైకి వచ్చి చదవలేని వాళ్ల కోసం ఇంటికే పుస్తకాలు పంపిస్తా. ఇక నాకు బషీర్(మలయాళ రచయిత) బుక్స్ అంటే చాలా ఇష్టం. ఒక లైబ్రరీలో పనిచేస్తే ఏదో ఒకరోజు రిటైర్‌మెంట్ తప్పదు. అదే మనమే యజమానులుగా ఉంటే జీవితాంతం అక్కడే సంతోషంగా గడిపేయొచ్చు కదా. అందుకే పెద్దైన తర్వాత అడ్వకేట్ అవుతా. ఇంతకంటే పెద్ద గ్రంథాలయం పెడతా’ అంటూ తన భవిష్యత్ ఆలోచన గురించి చెప్పుకొచ్చింది.