తిరువనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాలంటీర్లు గుదిబండలా తయారవుతారంటూ ప్రతిపక్ష టీడీపీతో సహా ఎంతో మంది విమర్శలు గుప్పించినా.. పట్టువీడని విక్రమార్కుడిలా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ నాలుగు లక్షలకుపైగా నిరుద్యోగులను గ్రామ వాలంటీర్లుగా నియమించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఏమాత్రం అవినీతికి ఆస్తారం లేకుండా వారే చూసుకుంటున్నారు. అయితే ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులోనూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్లు విశేష కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లాక్‌డౌన్‌లోనూ.. వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధుల మేరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ, రేషన్ సరఫరా వంటి కార్యక్రమాల్లో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే కరోనా వైరస్ కట్టడికి నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తికనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయించారు. మహమ్మారి కరోనా వైరస్ కేరళపై తీవ్ర ప్రభావం చూపుతోన్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన భేటీ అయిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నివారణకు గ్రామ స్థాయిలో సేవకులుగా 2 లక్షల 36 వేల వాలంటీర్లును వెంటనే నియమించాలని నిర్ణయించారు. అలాగే వీరందరినీ కేవలం గ్రామాల్లోనే కాకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కూడా ఉపయోగించుకోవాలని విజయన్ భావిస్తున్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా కరోనా కేరళపై తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే.
మరోవైపు గ్రామ వాలంటరీ వ్యవస్థపై పలు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. వీరిలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముందువరుసలో ఉన్నారు. బ్రిటన్‌లో ఇప్పటికే 2 లక్షల 80 వేల గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. వీరందరిని కరోనాపై పోరుకు సహాయకులుగా ఉపయోగించుకోనున్నారు. కాగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. గ్రామ వాలంటీర్లు నియమితులైన వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధిని పొందారు.
Comments
Please login to add a commentAdd a comment