నర్సు లినీ (ఫైల్ ఫొటో)
తిరువనంతపురం : ‘నిపా’ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న కేరళ నర్సు అదే వైరస్ సోకి మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వృత్తి ధర్మం నిర్వర్తించిన నర్సు లినీ పుత్తుస్సెరీ (31) కుటంబానికి కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. నర్సు లినీ భర్త సజీశ్‌కు ప్రభుత్వం ఉద్యోగం కల్పించడంతో పాటు వారి సంతానం ఇద్దరికి (సిద్ధార్థ్, రితుల్) చెరో రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సోమవారం మృతిచెందిన నర్సు లినీ సేవలకుగానూ కేరళ కేబినెట్ బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
నిపా వైరస్ బారినపడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించనున్నట్లు కేబినెట్ తెలిపింది. కోజికోడ్‌లోని పెరంబరా హాస్పిటల్‌లో నిపా వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందించిన వైద్య సిబ్బందిలో లినీ ఒకరు. కాగా, నిపా వైరస్ సోకిన ఆమె మృతిచెందే కొన్ని నిమిషాల ముందు భర్త సజీశ్‌కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నిపా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున కుటుంబసభ్యులకు చివరిచూపులు లేకుండానే నర్సు లినీ అంత్యక్రియలను నిర్వహించాల్సి వచ్చింది. మరోవైపు నిపా వైరస్ కేసులు 13 నమోదు కాగా, 10 మంది మృతిచెందినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment