నిపా వైరస్‌ : మరణశయ్యపై నుంచి భర్తకు లేఖ | Nurse Succumbed To Death To Nipah Virus In Kerala | Sakshi
Sakshi News home page

నిపా వైరస్‌ : మరణశయ్యపై నుంచి భర్తకు లేఖ

Published Tue, May 22 2018 12:32 PM | Last Updated on Tue, May 22 2018 12:44 PM

Nurse Succumbed To Death To Nipah Virus In Kerala - Sakshi

నర్సు లినీ(ఫైల్‌ ఫొటో)

తిరువనంతపురం, కేరళ : ‘నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నిన్ను కలుసుకునే సమయం లేదని కూడా తెలుసు. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వాళ్లను గల్ఫ్‌కు తీసుకెళ్లు. నేనులేను అని మా నాన్నగారిలానే జీవితాంతం ఒంటరిగా ఉండకు’ ఇవి నిపా వైరస్‌ సోకి మరణశయ్యపై ఉన్న నర్సు లినీ(31) చివరి మాటలు.

నిపా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లినీకి కూడా ఆ వ్యాధి సోకింది. కొద్దిరోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. మరణానికి కొద్ది గంటల ముందు భర్తకు లినీ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరి నుంచి మరొకరికి నిపా వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో కుటుంబసభ్యులకు కనీసం ఆఖరి చూపుకైనా లేకుండా లినీ భౌతికకాయానికి దహనసంస్కారాలు నిర్వహించారు.

లినీ మరణంపై స్పందించిన డాక్టర్‌ దీపూ సెబిన్‌ దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కాగా, నిపా వైరస్‌ సోకి పలువురు కేరళలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు నర్సులు ఉన్నారు.

ఏంటీ నిపా వైరస్‌?
గబ్బిలాలు, పందుల ద్వారా ఎక్కువగా నిపా వైరస్‌ సోకుతుంది. గబ్బిలాలు తీసుకున్న ఆహారం ద్వారా ఇది సోకుతుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయల ద్వారా ఇది సోకే ప్రమాదం ఎక్కువ. పందులు, పిల్లి, కోతులు తదితరాల ద్వారా కూడా ఇది మనుషులకు సోకుతుంది.

వ్యాధి లక్షణాలు :
- శ్వాస తీసుకోలేకపోవడం
- జ్వరం
- తలనొప్పి
-  తల∙నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి క్రమంగా పదిహేను రోజుల పాటు జ్వరం వెంటాడిన పక్షంలో నిపా బారిన పడ్డట్టే.

సలహాలు :
- పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం
- పండ్లు, కూరగాయలను పరిశుభ్ర పరిచిన తర్వాతే తీసుకోవడం
- చేతులను ప్రతిసారీ సబ్బతో కడుక్కోవడం
- మామిడిపండ్లు, జాక్‌ ఫ్రూట్స్‌, రోజ్‌ ఆపిల్స్‌లను గబ్బిలాలు ఆహారంగా ఎక్కువ తీసుకుంటాయి. వీటిని వినియోగించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement