తిరువనంతపురం : వరదలతో ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు కేరళ ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. కుటుంబంలోని మహిళ పేరుతో రూ లక్ష వరకూ అందించే ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందని సీఎం తెలిపారు. ఆగస్టు 8 నుంచి కురిసిన భారీ వర్షాలతో కేరళ చిగురుటాకులా వణికింది.
కనీవినీ ఎరుగని వరదలతో 231 మంది మరణించగా 26,000కు పైగా గృహాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలు వరద ధాటికి కొట్టుకుపోయాయి. వేలాది పునరావాస శిబిరాల్లో పది లక్షల మందికి పైగా తలదాచుకుంటున్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం వరదలతో కేరళకు రూ. 20,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. ఈ మొత్తం ప్రస్తుత సంవత్సర ప్రణాళిక వ్యయంతో సమానం కావడం గమనార్హం. 40,000 హెక్టార్లలో పంట దెబ్బతిందని సీఎం విజయన్ వెల్లడించారు. కేంద్రం కేరళకు ఇతోధికంగా వరద సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment