
తిరువనంతపురం : కేరళలో వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలతో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. వరద బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వరద నీరు నిలిచిపోవడంతో కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ను శనివారం వరకూ మూసివేశారు. భారీ వర్షాలతో విమానాశ్రయం రన్‌వే, పార్కింగ్ ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు పలు రైలు సర్వీసులు రద్దుకాగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
కేరళ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరాతీశారు. ఈరోజు ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మరోసారి ఫోన్ చేశాను. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఆరా తీశాను. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు మరింత పెంచాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి తెలియజేశారు. వరద తాకిడి తీవ్రమవడంతో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు ఇండియన్ ఆర్మీ, నేవీ 21 సహాయ, డైవింగ్ బృందాలను కేరళకు తరలించింది. వయనాడ్ జిల్లాలోనే జెమిని బోట్స్‌తో పలు ప్రాంతాల్లో ఐదు నౌకాదళ బృందాలు రంగంలోకి దిగాయి. వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు సహాయ, పునరావాస శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు.