నటి కేసుతో మాకు సంబంధం లేదు: హీరో తల్లి
కొచ్చి: తన కుమారుడు అమాయకుడని, అతడికి నటి కేసుతో ఎలాంటి సంబంధంలేదని మలయాళ సూపర్ స్టార్ దిలీప్ తల్లి సరోజం పిళ్లై అన్నారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఆమె లేఖరాశారు. మలయాళ నటి అపహరణ, వేధింపుల కేసుకుగానూ కేరళ పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అలువా సబ్ జైలులో ఉన్న తన కుమారుడు దిలీప్‌కు బెయిలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదివరకే బెయిలు మంజూరు చేయాలన్న దిలీప్ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. నటుడు మరోసారి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను ఈ నెల 18న మరోసారి హైకోర్టు విచారించనుంది. కేసు తప్పుదోవ పడుతోందని, విచారణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లేఖద్వారా దిలీప్ తల్లి సరోజం పిళ్లై సీఎంను కోరారు. నేరాలకు పాల్పడే తరహా వ్యక్తి దిలీప్ కాదన్నారు. కేసును మరోసారి విచారించి తమకు న్యాయం చేయాలని ఆమె విన్నవించారు. మరోవైపు సరోజం పిళ్లై నుంచి లేఖ అందినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఆమె రాసిన లేఖను కేరళ పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహెరాకు పంపినట్లు సమాచారం.
రాష్ట్ర కేబినెట్ మంత్రి పీసీ జార్జ్‌పై బాధిత నటి సీఎంకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసిన మరుసటి రోజే దిలీప్ తల్లి కూడా పినరయి విజయన్‌కు లేఖ రాయడం గమనార్హం. మంత్రి పీసీ జార్జ్ తీరు కేసు విశ్వనీయతను ప్రశ్నించేలా ఉందని, కేసు తప్పుదోవ పట్టకుండా చూడాలని నటి తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ సహా ఏడుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.