స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో విడిపోయిన ఓ యువజంట, 72 ఏళ్ల తర్వాత అనూహ్యంగా కలుసుకుంది. ఒకరికోసం మరొకరు చాలా ఏళ్లు ఎదురు చూసి, ఇక జీవితంలో కలవలేమని నిరాశ చెంది, పరిస్థితులతో రాజీ పడిపోయి బతికిన ఆ జంట.. జీవిత చరమాంకంలో కలుసుకోవడం ఒక సినిమా కథనే తలపింపజేస్తోంది.
అసలు ఏం జరిగిందంటే..
అది 1946వ సంవత్సరం. కేరళలోని కవుంబాయి గ్రామం. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజులు. ఏక్‌నారాయణన్ నంబియార్ వయసు 17 ఏళ్లు. శారదకి 13 ఏళ్లు.. వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. పట్టుమని పదినెలలు కలిసి ఉన్నారో లేదో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భూస్వాములకి వ్యతిరేకంగా రైతన్నలు కదం తొక్కారు. ఆ ఉద్యమంలో నారాయణన్ నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్‌తో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. ఆ ఉద్యమం హింసాత్మకంగా మారింది. బ్రిటిష్ జవాన్ల కాల్పుల్లో చాలా మంది మరణించారు. నారాయణన్ నంబియార్ అందులో తప్పించుకున్నారు. తండ్రితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఇంట్లోనే దాక్కున్నారని బ్రిటిష్ పాలకులు భావించారు. వారి ఆదేశాల మేరకు మలబార్ స్పెషల్ పోలీసులు నంబియార్ ఇంటిపైన దాడి చేశారు. నంబియార్ ఆచూకీ చెప్పకపోతే అందరినీ కాల్చి పారేస్తామని హెచ్చరించారు. ప్రాణభయంతో గజగజలాడుతున్న శారదను చుట్టుపక్కల వారు కాపాడి వాళ్ల పుట్టింటికి పంపేశారు.
ఆ తర్వాత నంబియార్ ఆచూకీని కనుక్కున్న పోలీసులు తండ్రీ కొడుకుల్ని జైల్లో పెట్టారు. తరచూ జైళ్లు కూడా మార్చారు. దీంతో భార్యాభర్తలిద్దరికి ఒకరి గురించి మరొకరికి వివరాలు తెలియలేదు. భర్త ఎప్పటికైనా వస్తాడేమోనని శారద ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసేది. కానీ పుట్టింటివాళ్లు బ్రిటిష్ సైన్యం నంబియార్‌ను చంపేసి ఉంటుందని నిర్ధారించుకొని ఆమెకి బలవంతంగా మళ్లీ పెళ్లి చేశారు. మరోవైపు జైల్లో రామన్ నంబియార్‌ను కాల్చి చంపేశారు. నారాయణన్ శరీరంలో కూడా తూటాలు దిగినా, ప్రాణగండం తప్పింది. పదేళ్ల తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన నారాయణన్ నంబియార్‌కి భార్య జాడ తెలియలేదు. దీంతో జీవితంతో రాజీపడి అతనూ మరో పెళ్లి చేసుకున్నారు. అలా ఒకరి పట్ల మరొకరికి అనంతమైన ప్రేమానురాగాలు ఉన్న ఆ జంటని విధి విడదీసింది. అలా ఏళ్లకి ఏళ్లు గడిచిపోయాయి. శారద కుమారుడు భార్గవన్ పెరిగి పెద్దయి వ్యవసాయం చేసేవాడు.
ఒకసారి వ్యవసాయ పనుల కోసం కన్నూర్‌కి వచ్చి అనుకోకుండా నారాయణన్ మేనల్లుడు మధుకుమార్‌ను కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు తమ కుటుంబ వివరాలు పంచుకున్నారు. అప్పుడే తెలిసింది మధుకుమార్ మేనమామ నారాయణన్ నంబియారే తన తల్లి శారద మొదటి భర్త అని. 30 ఏళ్ల క్రితమే శారద రెండో భర్త మరణించారు. నంబియార్ భార్య కూడా చాలా ఏళ్ల క్రితమే కన్నుమూసింది. అందుకే వాళ్లిద్దరూ ఆ మాజీ జంటని ఒక్కటి చెయ్యాలని అనుకున్నారు. విషయం విన్న నంబియార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ శారద పరిస్థితి కూడా అదే. నంబియార్ రెక్కలు కట్టుకొని భార్గవన్ ఇంట్లో వాలిపోయారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 72 ఏళ్ల తర్వాత, తొంబై ఏళ్ల వయసులో ఒకరినొకరు చూసుకోగానే వారిద్దరికీ నోటి వెంట మాట కూడా రాలేదు. కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీళ్లని అదిమిపెట్టుకుంటూ నంబియార్ శారద తలపై చేయి వేసి ఆర్తితో నిమిరాడు. ఆ చర్య ఒక్కటి చాలు. వారిద్దరి గుండెల్లో ప్రేమ ఎంతలా గూడు కట్టుకొని ఉందో చెప్పడానికి. ఇదంతా చూసిన బంధువులు కూడా వారిద్దరిదీ ఆత్మబంధం అని కీర్తించారు. ఇక తరచూ ఆ రెండు కుటుంబాలు కలవాలని నిర్ణయించుకున్నాయి. ఆనాటి రైతు పోరాటంతోపాటు వీరిద్దరి జీవిత కథని నారాయణన్ మనవరాలు శాంత ‘డిసెంబర్ 30’ అన్న పేరుతో ఒక నవలగా తీసుకువస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment