గిన్నిస్ పుటల్లో ఎక్కనున్న గజరాజు!
కేరళ గజరాజుకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఆసియాలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన ఏనుగుగా 86 ఏళ్ళ వృద్ధ ఏనుగు గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. వృద్ధాప్యంలోనూ హుషారుగా గడిపేస్తున్న ఏనుగు గురించి యజమానులు.. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) గిన్నిస్ అధికారులకు వివరాలతో లేఖ రాశారు. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఏనుగుగా దాక్షాయణి గురించి లేఖలో వివరించారు.
ప్రాణాలతో జీవిస్తున్న ఏనుగుల్లో దాక్షాయణి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు అని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు పరీయర్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళ అటవీశాఖ రికార్డులు కూడా అదే విషయాన్ని స్సష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన దాక్షాయణిని ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ బోర్డు ప్రత్యేకంగా సత్కరించింది. దేవస్వం మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ సత్కార కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఫారెస్ట్ మినిస్టర్ కె. రాజు పంచదేరం టైటిల్ తో ఏనుగును సత్కరించారు. ట్రావెన్ కోర్ రాజులు దాక్షాయణిని టీడీబీ కి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏనుగు ఛంగలూర్ మహాదేవ ఆలయంలో ఉంటోంది. కేరళ పోస్టల్ సర్వీస్ కూడా దాక్షాయణి పేరిట ఓ ప్రత్యేక పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉంది.
తైవాన్ కు చెందిన ఏనుగు.. 85 ఏళ్ళ వయసులో 2003 లో చనిపోగా... దాక్షాయణి 86 ఏళ్ళు జీవించిఉన్న ఏనుగుగా ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకుని, గిన్నిస్ పుటలకు ఎక్కనుంది.