తెలంగాణ బిల్లు’పై చర్చల కోసమే ఢిల్లీకి కిరణ్!
తెలంగాణ బిల్లు’పై చర్చల కోసమే ఢిల్లీకి కిరణ్!
Published Wed, Sep 4 2013 3:29 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానంపెట్టి ఆమోదింపజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదే గనుక.. ఆ దిశగా ఆయన్ను సిద్ధం చేయటానికే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. విభజనపై సీమాంధ్ర ప్రజలను ఒప్పించే దిశగా నోట్‌ను కాస్త ‘మధ్యే మార్గంగా’ రూపొందించి దాని ఆధారంగానే బిల్లుకు రూపక ల్పన చేసి, అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపజేసే దిశగా కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలు సాగిస్తున్నట్లు సమాచారం. ‘ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలనుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాల్లో ముఖ్యమైనవేమిటి? వాటినెలా పరిష్కరించవచ్చు? అందుకు నోట్‌లో ఏమేం పొందుపరచాలి?’ తదితరాలపై కిరణ్ నుంచి సమాచారం తీసుకోనున్నారు.
హైదరాబాద్ సహా.. నీరు, విద్యుత్, ఉద్యోగుల వంటి ప్రధాన సమస్యలపైనే చర్చ సాగుతుందని తెలుస్తోంది. హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర నేతలు, ప్రజలు గట్టిగా పట్టుపడుతున్నందున దానిపై తమ ప్రతిపాదనలను కేంద్రం పెద్దలు కిరణ్ ముందుంచుతారని తెలుస్తోంది. పదేళ్ల పాటు ఎటూ ఉమ్మడి రాజధానిగా ఉండనుంది గనుక ఆ సమయంలో అక్కడి వ్యవహారాలన్నీ కేంద్రం పరిధిలో ఉండేలా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే యోచనపైనా ఆయనతో కేంద్రం చర్చించనుంది. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించే ప్రతిపాదన కూడా పరిశీలన లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. రాయలసీమ నేతల నుంచి రాయల తెలంగాణ ప్రతిపాదనలూ వస్తున్నందు న దానిపైనా పెద్దలు సమాలోచనలు సాగిస్తున్నారు.
నాలుగు రోజులు ఢిల్లీలోనే!
సీఎం కిరణ్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేస్తారని సమాచారం. సీమాంధ్ర ఉద్యమం తదితరాలపై రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి షిండే, ఆర్థికమంత్రి చిదంబరం, రక్షణమంత్రి ఆంటోనీ తదితరులతో ఆయన భేటీ అవుతారు. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మరికొన్ని రోజులు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కిరణ్ హస్తిన యాత్ర నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితర రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. సి.రామచంద్రయ్య వంటి మరికొందరు మంత్రులు బుధ, గురువారాల్లో వెళ్లనున్నారు.
Advertisement