సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదాపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టాన్ని అపహాస్యం చేసేలా దోషులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేసింది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చట్టంలోని లొసుగులకు అనుకూలంగా ఉపయోగించుకున్నారని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ మేరకు దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు స్టే విధించడంపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భారత చట్టాలపై పార్లమెంట్ వేదికగా సుదీర్ఘమైన చర్చజరగాలని, దేశ అత్యున్నత న్యాయస్థానం దోషులుగా తేల్చినా.. శిక్ష అమలులో ఇంత ఆలస్యం జరగమేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. (నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా)
శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా దోషులు ఉరిశిక్షను ఆలస్యం చేస్తూ.. చట్టాలను అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. శిక్ష పడిన వెంటనే దానిని అమలు చేసేలా సుప్రీంకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని కిషన్ రెడ్డి కోరారు. కాగా కాలంచెల్లిన సీఆర్‌పీసీ, ఐపీసీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కాలానికి అనుగుణంగా మార్పులు చేయాలని ఇప్పటికే ఆయన పలుమార్లు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృషి సారిస్తోందని, పార్లమెంట్ సాక్షిగా ఆయా చట్టాలపై చర్చ జరగాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు నోటీసులు పంపింది. మరోసారి డెత్‌వారెంట్లు జారీచేసే వరకు ఉరి శిక్షను వాయిదా వేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment