కోల్‌కతా: ఆమె ఓ అనాథ బాలిక. ఐదేళ్ల వయస్సులో కోల్‌కతాలోని ఓ ఫుట్‌పాత్‌పై తిరుగాడుతున్న ఆమెను ఇక్కడి రెయిన్‌బో హోం అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేరదీసి ఆశ్రయమిచ్చారు. వారి ప్రాపకంలో పెరిగి పెద్దదైన ఆ అనాథ బాలిక ఇవాళ అమెరికాలో చదువుకునే అదృష్టాన్ని దక్కించుకుంది. ఆమె పేరు ఏంజెలా బెర్నాడెట్టె రైల్. అమెరికా విదేశాంగ శాఖ నిధులతో కొనసాగుతున్న కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం(సీసీఐపీ)లో భాగంగా ఆ దేశంలోని కమ్యూనిటీ కళాశాలల్లో చదివేందుకోసం భారత్ నుంచి 35 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
వీరిలో 19 ఏళ్ల ఏంజెలా ఒకరు. చిన్నారులకు బోధన ఎలా చేయాలో నేర్పించే ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్’ కోర్సు చేసేందుకు ఆమె వాషింగ్టన్ లేక్‌వుడ్‌లో పియర్స్ కమ్యూనిటీ కళాశాలలో చేరనుంది. అమెరికాలో చదివే అదృష్టం తన తలుపు తడుతుందని కలలో కూడా ఊహించలేదని కళ్లల్లో సంతోషం తొణికిసలాడుతుండగా ఏంజెలా చెప్పింది. ఐదేళ్ల వయస్సులో ఏంజెలాను చేరదీసిన రెయిన్‌బో హోం సభ్యులు ఆమెను సీల్దాహ్‌లోని లొరెటో స్కూల్‌లో చేర్చారు. ఒకవైపు చదువుకుంటూనే తానుంటున్న హోంలోని ఇతర అనాథ పిల్లలకు ఏంజెలా ఆంగ్లం బోధించేది. 12వ తరగతి పరీక్షలు రాసిన అనంతరం ఏంజెలా అదే రెయిన్‌బో హోంలో ఓ బృందానికి నాయకురాలిగా వ్యవహరిస్తూ.. వీధి బాలల సమస్యలపై కార్యక్రమాలు, సర్వేలు నిర్వహిస్తోంది.
అనాథ బాలికకు అమెరికా ఆఫర్!
Published Wed, Jun 25 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
Advertisement