బీహార్‌కు భారీ వరద ముప్పు
కోసీ నదిలో పెరుగుతున్న నీటిమట్టం
{పజలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం
ఇప్పటికే 44 వేల మంది సురక్షిత ప్రాంతాలకు
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్తలు..
పాట్నా: బీహార్‌లోని తొమ్మిది జిల్లాలకు భారీ వరద ముప్పు ముంచుకొస్తోంది. కోసీ నదిలో నీటిమట్టం భారీగా పెరుగుతుండడంతో తీరప్రాంతాల్లోని వేలాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎగువ ప్రాంతాలకు బలవంత ంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 44 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేపాల్‌లోని కోసీ ప్రధాన ఉపనది భోటే కోసీ నుంచి నీరు వెల్లువెత్తడంతో కోసీ నిండుకుండలా మారింది. నేపాల్-బీహార్ సరిహద్దుకు 260 కి.మీ దూరంలో శుక్రవారం భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డంతో భోటే కోసీ మూసుకుపోయి, 32 లక్షల క్యూసెక్కుల నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతం 2.5 కి.మీ విస్తీర్ణంతో సరస్సులా మారింది. అంతకుముందు.. దగ్గర్లోని మంఖానా గ్రామంలో వంద ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డంతో ఎనిమిది మంది చనిపోగా, 200 మందికిపైగా గల్లంతయ్యారు. నదిలో శిథిలాలను తొలగించేందుకు నేపాల్ ఆర్మీ రెండు తక్కువ స్థాయి పేలుళ్లు జరిపింది.
నది నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో బీహార్‌లోని కోసీలో నీరు పెరుగుతోంది. ముందు జాగ్రత్తగా సుపౌల్, సహర్సా, మాధేపురా, ఖగారియా, అరారియ, మధుబని, భాగలూపర్, పూర్ణియా, దర్భంగా జిల్లాలోని తీరప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇందుకోసంజాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఏన్డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, ఆర్మీలకు చెందిన జవాన్లను వందల సంఖ్యలో ఈ జిల్లాల్లో మోహరించారు. నదిలో నీరు గణనీయంగా పెరిగితే 4.25 లక్షల మంది ఇబ్బంది పడతారని, వారందర్నీ బలవంతంగా తర లించడానికి విపత్తునియంత్రణ చట్ట నిబంధనలను అమల్లోకి తెచ్చామని విపత్తు నియంత్రణ విభాగం(డీఎండీ) ప్రత్యేక కార్యదర్శి అనిరుధ్ కుమార్ చెప్పారు.