భారత్‌ కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా | Kovind meeting with TDP MPs, MLAs and MLCs | Sakshi
Sakshi News home page

భారత్‌ కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా

Published Wed, Jul 5 2017 2:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

భారత్‌ కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా - Sakshi

భారత్‌ కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా

- ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పష్టీకరణ
- టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోవింద్‌ సమావేశం
 
సాక్షి, అమరావతి: ‘‘ఆధునిక భారతదేశం కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా... కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తా... సమాజ అభివృద్ధి, యువత కలలను నెరవేర్చడమే లక్ష్యంగా నూతన భారత్‌ నిర్మాణం కోసం కృషి చేస్తా. నేను ఏ రాజకీయ పార్టీకీ చెందిన వాడిని కాదు. బిహార్‌ గవర్నర్‌గా నన్ను నియమించినప్పుడే బీజేపీకి రాజీనామా చేశా. అప్పటి నుంచి రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నా’’ అని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కోవింద్‌ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తెలుగు వారికి గర్వకారణమన్నారు.  రాష్ట్రపతిగా 125 కోట్ల మంది ప్రజలకు సేవ చేసేందుకు తనకు మద్దతివ్వాలని కోవింద్‌ కోరారు. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ రాష్ట్రపతిగా మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నామని వెంకయ్య పేర్కొన్నారు. కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ప్రధాని మోదీ తనకు ఫోన్‌ చేసి అభ్యంతరం ఏమైనా ఉందా? అని అడిగారని, తాను సంపూర్ణ మద్దతిస్తానని చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కోవింద్‌కు 70 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి స్థితిలో మరొకరు గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

ఏపీ మూడేళ్ల పసిబిడ్డ అని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయని, కోవింద్‌ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి రామ్‌నాథ్‌ కోవింద్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశం అనంతరం కోవింద్‌కు చంద్రబాబు అల్పాహార విందు ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన రామ్‌నాథ్‌కు గన్నవరం విమానాశ్రయంలో  చంద్రబాబుతోపాటు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement