తొలి ‘బీజేపీ రాష్ట్రపతి’గా కోవింద్
- ఓడిన రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలువనున్న మీరా
నేడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో... రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే మొదటి బీజేపీ అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. అదే సమయంలో ఓటమి పాలయ్యే రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా మీరా కుమార్ నిలిచిపోనున్నారు.
రాష్ట్రపతి పదవికి ఇంతవరకూ 14సార్లు ఎన్నికలు జరగ్గా ఒకే ఒక్కసారి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. 1969లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డి.. ఇందిరాగాంధీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరి చేతిలో పరాజయం పొందారు. ఇక బీజేపీ అధికారంలో ఉండగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవికి ఆ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దిగడం ఇదే మొదటిసారి. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉండగా జరిగిన 2002 ఎన్నికలో గెలిచిన కలాంకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా 2007 రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతి భైరవ్‌సింగ్ షెఖావత్ పోటీ చేసి ఓడిపోయారు.
రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. 1977, 2002 ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో ప్రతిపక్షంలో ఉండగా, 1997లో యునైటెడ్ ఫ్రంట్ సర్కారుకు కాంగ్రెస్ బయటి నుంచి మద్దతిచ్చింది. 1997 రాష్ట్రపతి ఎన్నికలో అప్పటి ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ నేత కేఆర్ నారాయణన్‌కు దళితుడనే కారణంగా యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్యపక్షాలు, వామపక్షాలతో పాటు బీజేపీ మద్ధతు తెలిపాయి. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు.
2002లో ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయపక్షాలు ప్రతిపాదించిన ఏపీజే అబ్దుల్ కలాంకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మద్దతివ్వగా, వామపక్షాల అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీ సెహగల్‌పై ఆయన గెలిచారు. ఇక ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్ మొదటిసారి రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ పెట్టలేదు. జనతా పార్టీఅభ్యర్థిగా ముందుకొచ్చిన కాంగ్రెస్ మాజీ నేత నీలం సంజీవరెడ్డికి కాంగ్రెస్ మద్దతివ్వడంతో పోటీలేకుండా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతిగా ఆయన నిలిచారు.
ఇక రాష్ట్రపతి ఎన్నికలో(1969) ఓడిపోయిన తొలి కాంగ్రెస్ ‘అధికార’ అభ్యర్థి కూడా నీలం సంజీవరెడ్డే కావడం విశేషం.. ఆయన అభ్యర్థిత్వం నచ్చని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉపరాష్ట్రపతి వీవీ గిరిని ‘ఇండిపెండెంట్’ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో నీలం ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సంజీవరెడ్డి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులెవరూ ఓడిపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున పోటీకి దిగిన మీరాకుమార్‌కు 17 పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, మీరాకుమార్‌ను సమర్ధిస్తున్న వివిధ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే మీరా ఓటమి ఖాయమని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికలో ఓడిన రెండో కాంగ్రెస్ నేతగా మీరా చరిత్రకెక్కుతారు.
రెండోసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కులం ప్రస్తావన
రాష్ట్రపతి ఎన్నికలో మొదటిసారి 1997లో కులం తెరపైకి వచ్చింది. అప్పటికి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను తొలి దళిత రాష్ట్రపతిని చేయాలంటూ పాలక యునైటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ కోరగా, బీజేపీ అందుకు అంగీకరించి మద్దతు పలికింది. మళ్లీ 20 సంవత్సరాల తర్వాత, పాలక ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా కోవింద్‌ను ప్రకటించి, దళిత అభ్యర్థిని గెలిపించాలనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. కాంగ్రెస్‌కు విజయావకాశాలు లేకున్నా దళితులకు పదవులిచ్చే విషయంలో తానే ముందున్నానని చెబుతూ దళిత వర్గానికే చెందిన మీరాను అభ్యర్థిగా ఎంపికచేసింది. దళిత్ వర్సెస్‌దళిత్ అంటూ ప్రచారం జరుగుతున్నా, దళితుల్లో అధిక మద్దతున్న చర్మకారేతర(చమార్ లేదా జాటవ్) నేతను రాష్ట్రపతిని చేయడం ద్వారా వారి మద్దతు బలోపేతం చేసుకోవడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్