రాష్ట్రపతి భవన్
- పార్లమెంట్ హౌస్, అసెంబ్లీల్లో పోలింగ్
- 20న ఓట్ల లెక్కింపు
- ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ గెలుపు నల్లేరుపై నడకే..
- దేశవ్యాప్తంగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 32
- ఓటు వేయనున్న ఎంపీల సంఖ్య 776
- ఓటు వేయనున్న ఎమ్మెల్యేల సంఖ్య 4,120
- ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,98,903
న్యూఢిల్లీ
రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీలో తలపడుతున్నారు. పార్లమెంట్ హౌస్‌లో ఒక పోలింగ్ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు.
దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
ఓటర్లకు ప్రత్యేక పెన్నులు..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వ్యక్తిగత పెన్నులను తీసుకురాకుండా ఈసీ నిషేధం విధించింది. వీరికి ప్రత్యేకంగా రూపొందించిన మార్కర్ పెన్నులను అందిస్తారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలట్ కాగితాలను, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలట్ కాగితాలను ఇస్తారు. తాము అందించే సీరియల్ నంబర్లతో కూడిన ఊదారంగు సిరా పెన్నులతోనే ఓటేయాలని ఈసీ ఆదివారం ఓ ప్రకటనలో సూచించింది. ‘ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు పోలింగ్ సిబ్బంది వారి వ్యక్తిగత పెన్నులను తీసుకుని, ప్రత్యేక పెన్నులను ఇస్తారు. ఓటర్లు కేంద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు వాటిని మళ్లీ తీసుకుని, వారి పెన్నులను వారికి ఇస్తారు’అని కొత్త నిబంధన గురించి ఈసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. గత ఏడాది హరియాణాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈసీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రత్యేక పెన్నులను మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ తయారు చేసింది. ఓటేసే సమయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుపుతూ ఈసీ ప్రత్యేక పోస్టర్లను కూడా సిద్ధం చేసింది. ఒక అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలని పార్టీలు విప్ జారీ చేయకూడదని పేర్కొంది.
అసెంబ్లీల్లో ఓటేయనున్న 55 మంది ఎంపీలు
14 మంది రాజ్యసభ, 41 మంది లోక్‌సభ ఎంపీలు కలిపి మొత్తం 55 మంది ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లో కాకుండా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటు వేయనున్నారు. వీరిలో ఎంపీ సభ్యత్వాన్ని ఇంకా వదులుకోని యూపీ సీఎం, డిప్యూటీ సీఎంలు యోగి అదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, గోవా సీఎం మనోహర్ పరీకర్ ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌లో, మరో నలుగురు ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలోని అసెంబ్లీలో ఓటేయనున్నారు.
రెండు శిబిరాలుగా చీలిన సమాజ్‌వాదీ పార్టీ
రాష్ట్రపతి ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ రెండు శిబిరాలుగా విడిపోయింది. ములాయం సింగ్ నేతృత్వంలోని ఒక వర్గం కోవింద్‌కు ఓటేయడం ఖాయం కాగా.. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వర్గం మాత్రం మీరాకుమార్‌కు మద్దతు ప్రకటించింది. కోవింద్ మంచి ఎంపికని, ఆయనతో ఎప్పటి నుంచో సత్ససంబంధాలు ఉన్నాయని ఇంతకముందే ములాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కోవింద్‌కు మోదీ ముందస్తు శుభాకాంక్షలు
ఎన్నికలకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ఎంపీల సమావేశానికి హాజరైన కోవింద్‌కు ప్రధాని శుభాకాంక్షలు చెప్పారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ వెల్లడించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌తో కోవింద్‌కున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు.
ఎన్నుకునేది వీరు..
లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. వీరిలో 776 మంది ఎంపీలు(233 మంది రాజ్యసభ , 543 మంది లోక్‌సభ ఎంపీలు), 4,120 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 4,896 మంది ఉన్నారు. ఎంపీల ఓటు విలువ 708 కాగా, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం.. ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి, తర్వాత దాన్ని వెయ్యితో భాగించగా వచ్చే మొత్తం ఆ రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యే ఓటు విలువ. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగించగా వచ్చే మొత్తం ఒక ఎంపీ ఓటు విలువ. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,98,903. కాగా, 5,37,683 ఓట్లున్న ఎన్డీఏకు తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మరో 12,000 ఓట్లు అవసరం. బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గాల మద్దతుతో కోవింద్ సునాయాసంగా గెలిచే అవకాశముంది. కోవింద్ గెలుపు దాదాపు నిశ్చయమేనని తెలుస్తున్నా.. లోక్‌సభ మాజీ స్పీకర్ అయిన మీరా కుమార్ గెలుపు కోసం కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి విపక్షం ప్రయత్నాలు మానడం లేదు. మీరా, బిహార్ మాజీ గవర్నర్ అయిన కోవింద్‌లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మద్దతు కోరారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది.